కృష్ణా జలాల పంపిణీ.. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ వాయిదా

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ జూలై 15, 16 తేదీలకు వాయిదా పడింది.

Update: 2024-05-16 02:58 GMT

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ జూలై 15, 16 తేదీలకు వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కృష్ణాజలాల్లో కేటాయించిన 1,005 టీఎంసీలు, గోదావరి డైవర్షన్‌ ద్వారా వచ్చే 45 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపునకు కేంద్రం గత అక్టోబర్‌లో నూతన మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రిబ్యునల్‌ విచారణ ప్రారంభించింది. ఇటీవలే రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్‌లో విచారణ అంశాలపై స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ (soc) దాఖలు చేశాయి. వాటిపై బుధవారం ఢిల్లీలో విచారణ కొనసాగింది. అయితే ఎస్‌వోసీలపై కౌంటర్‌ అఫిడవిట్‌, స్టేట్‌మెంట్లను దాఖలు చేసేందుకు 4 వారాల గడువు కావాలని ఆంధ్రప్రదేశ్, రెండు వారాల గడువు కావాలని తెలంగాణ విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో విచారణను జూలై 15, 16కు ట్రిబ్యునల్‌ చైర్మన్‌, జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ వాయిదా వేశారు. అయితే జూలై 8లోగా విచారణ అంశాల డ్రాఫ్ట్‌ను దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు.


Similar News