సొంత పార్టీ నేతలకే పరాభవం... బయటకు తోసేసిన పోలీసులు

పార్టీ అధినేత దర్శనమే మహా భాగ్యమని భావించే గులాబీ నేతలకు ఇప్పుడు జాతీయ పార్టీని ప్రకటించే వేళ చేదు...No Permission for TRS Leaders at Telangana Bhavan

Update: 2022-10-05 07:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ అధినేత దర్శనమే మహా భాగ్యమని భావించే గులాబీ నేతలకు ఇప్పుడు జాతీయ పార్టీని ప్రకటించే వేళ చేదు అనుభవం ఎదురైంది. పార్టీ తరఫున నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా చివరకు కీలక సమయాల్లో వారికి ఎంట్రీ దొరకడంలేదు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న ఘట్టాన్ని పార్టీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఆ ప్రకటన కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలతో తెలంగాణ భవన్‌కు వచ్చి కేసీఆర్ నోటి వెంట వచ్చే బీఆర్ఎస్ పదాలను వినాలనుకున్నారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలకు కూడా వెళ్ళనీయకుండా గేటు బయటే ఆపివేశారు.

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ(శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డిని గేటు దగ్గరే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. వారిద్దరినీ లోపలికి వెళ్ళనీయలేదు. నామినేటెడ్ పోస్టులతో రెండు వేర్వేరు కార్పొరేషన్, సంస్థలకు చైర్మన్‌లుగా ఉన్నామని చెప్పుకున్నా వారికి లోపలికి ప్రవేశం లభించలేదు. కేసీఆర్ ప్రకటనలు వచ్చినప్పుడల్లా చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించే వీరికి పార్టీ చరిత్రనే మలుపుతిప్పే ఈ కార్యక్రమానికి మాత్రం అవకాశం దక్కలేదు. కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా యాక్టివ్‌గా పాల్గొంటున్నా చివరకు స్వంత పార్టీలోనే మర్యాద దక్కలేదు. గేటు దగ్గర నుంచి వారిని బయటకు తోసివేశారు పోలీసులు.

Similar News