'పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి'

ఈ నెల 07, 08 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర 22వ మహాసభలల్లో అశేష విద్యార్థి లోకం పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు.

Update: 2022-12-06 16:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 07, 08 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర 22వ మహాసభలల్లో అశేష విద్యార్థి లోకం పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పీడీఎస్‌యూకు ఘనమైన చరిత్ర ఉన్నదని, సమాజంలో కుల, పేద, ధనిక తారతమ్యాలు, స్త్రీ పురుష అసమానతలు పోవాలని సమసమాజం రావాలని కొట్లాడి అనేకమంది విద్యార్థి నాయకులు అమరత్వం పొందారని తెలిపారు. జార్జిరెడ్డి, జంపాల చంద్ర శేఖర్, ప్రసాద్, కోలా శంకర్, చేరాలు, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి, స్నేహలత లాంటి వాళ్ళను, మతోన్మాదులు, ప్రైవేటు గుండాలు హత్యలు చేశారని మండిపడ్డారు. వారి లక్ష్యాలను, ఉన్నతమైన భావాలను నేటి విద్యార్థి లోకం అనుసరించాలని సూచించారు. అందులో భాగంగానే పీడీఎస్ యు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. నాగేశ్వరరావు, బోయిన్పల్లి రాము మాట్లాడుతూ.. డిసెంబర్ 7 వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో వీఎస్‌టీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు విద్యార్ధి ప్రదర్శన నిర్వహించి, అక్కడ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితర ముఖ్య నాయకులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 8వ తేదీన వీఎస్‌టీ హల్ నందు ప్రదినిధుల సభ ఉంటుందని, ఈ సభలో ప్రముఖ నాస్తిక సంఘం అఖిల భారత కార్యదర్శి నరేంద్ర నాయక్ పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు. అనంతరం పీడీఎస్‌యూ సంస్థాగత కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. అనిల్, రాష్ట్ర నాయకులు కె.ప్రవీణ్ కుమార్, ఎన్. సుమంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News