పొట్టు పొట్టు తిట్టుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ సోషల్ మీడియాలు!

బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా? అంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కి బీఆర్ఎస్ స్పందిస్తూ దొంగే తిరిగి పోలీసోడి వెంటపడటం అంటే ఇదేనని కౌంటర్ ట్వీట్ చేసింది.

Update: 2024-05-12 14:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా? అంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కి బీఆర్ఎస్ స్పందిస్తూ దొంగే తిరిగి పోలీసోడి వెంటపడటం అంటే ఇదేనని కౌంటర్ ట్వీట్ చేసింది. పొలింగ్ కి కొద్ది సమయం మాత్రమే ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ట్విట్టర్ వార్ చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చేసిన విమర్శలతో మొదలైన వివాదం.. చివరకు ముదిరి బీజేపీ మీరు దోస్తీ అంటే మీరు దోస్తీ అంటూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రజల నినాదం "నిన్ను నమ్మం రేవంత్" అని, గ్యారెంటీలు ఏవి అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ట్వీట్లకు కాంగ్రెస్ స్పందిస్తూ.. "బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా?", "ఎన్డీఏలోకి బీఆర్ఎస్ చేరినట్లేనా?", "కవితను లిక్కర్ స్కామ్ నుండి తప్పిస్తామని హామీ ఏమైనా ఇచ్చారా?" అని ట్వీట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.

"దొంగే తిరిగి పోలీసుని తరిమినట్లు ఉంది" అని, ఎన్నికల్లో డమ్మీ అభ్యర్ధులను పెట్టి బీజేపీకి అంటకాగుతున్నారని, మోడీని పొగుడుతూ.. బీజేపీకి వంత పాడుతున్నారని అన్నారు. అంతేగాక కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే ప్రజలకి పైసాకి పనికిరావు అని చెబుతూ.. రేవంత్ హామీలు అమలయ్యే దాక బడే భాయ్ మోడీకి అదరం.. ఛోటే భాయ్ రేవంత్ కి బెదరం అని, తోడు దొంగలైన బీజేపీ, కాంగ్రెస్ లపై పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. దీనిపై మరో సారి కాంగ్రెస్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా బీజేపీ పార్టీని విమర్శించలేని దిక్కుమాలిన సోషల్ మీడియా మీదని మండిపడ్డారు. నేరుగా బీజేపీ సోషల్ మీడియాపై ఒక్క పోస్ట్ కూడా లేకపోవడంతోనే వాళ్లకు భయపడి అమ్ముడు పోయినట్లు అర్ధం అవుతుందని, 120 నెలల పాలన పై ఒక్క విమర్శ కూడా లేదు కానీ 5 నెలల పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడు, సీఎం పేరు, ఫోటో లేకుండా మీకు బ్రతుకే లేదని, ఇప్పటికైనా నేరుగా విమర్శించి మీ చిత్తశుద్దిని నిరుపించుకోవాలని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సవాల్ విసిరింది.


Similar News