కేసీఆర్, కేటీఆర్‌లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్.. ఎందుకంటే..?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్

Update: 2024-04-27 17:09 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ శనివారం పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిపై చర్యలు తీసుకోవాలని దర్యాప్తును సమర్ధవంతంగా జరిపించాలని ఆయన తన ఫిర్యాదులో వివరించారు. ఈ దర్యాప్తును 2014 నుంచి 2023 వరకు జరిపించాలని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లా ఆఫీసర్స్ మీద జరిగిన ట్యాపింగ్ మీద కూడా దర్యాప్తు జరగాలని అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో కోరారు. ఈ నేపధ్యంలో దర్యాప్తుకు కావాల్సిన తన వద్ద ఉన్న ఆధారాలను ఫిర్యాదుతో పొందుపరుస్తున్నానని ఆయన చెప్పారు.

హై కోర్టు వేదికగా గతంలో ఏజీపీగా పని చేసిన సంతోష్ రావు ప్రణీత్ రావుతో కలిసి చాలా మంది లా ఆఫీసర్స్ ఫోన్‌లను సైతం ట్యాపింగ్ చేశారని అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇదంతా అప్పటి బీఆర్ఎస్, ప్రభుత్వ సుప్రీమ్ సహకారంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్‌పై కథనాలు రాసిన వారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తున్నారని ఫిర్యాదులో న్యాయవాది వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసే అవకాశం ఉంది.

Similar News