భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రద్దు పై పెదవి విప్పని ప్రజాప్రతినిధులు

నిత్యం సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాదు వరకు ప్రయాణికులను చౌకధర టికెట్ ఖర్చులతో తమ తమ గమ్యాలకు చేరవేసే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-05-02 10:40 GMT

దిశ/మందమర్రి : నిత్యం సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాదు వరకు ప్రయాణికులను చౌకధర టికెట్ ఖర్చులతో తమ తమ గమ్యాలకు చేరవేసే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడవ రైల్వే లైన్ మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలుమార్లు భాగ్యనగర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలును రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే నిరుపేద సామాన్య ప్రజలు ప్రయాణం సాగించేందుకు అతి తక్కువ టికెట్ ఖర్చులతో ప్రయాణికులు రాకపోకలు సాధిస్తూ ఉంటారు. దాదాపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హైదరాబాదు నుంచి కాగజ్ నగర్ పట్టణానికి బయలుదేరుతుంది. మళ్లీ అదే ట్రైన్ ఉదయం నాలుగు గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ కు వెళుతుంది. ఈ రైలు ప్రారంభమై దాదాపు 38 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఏనాడు రైలు రద్దయిన దాఖలాలు లేవు.

గత 2020 సంవత్సరం మార్చి మాసంలో (కోవిడ్-19) కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ఎక్స్ ప్రెస్ ను నిలుపుదల చేశారు. ఆ తర్వాత మూడవ రైల్వే లైన్ మరమ్మత్తుల పేరిట ఏప్రిల్ 29 నుంచి రెండు వారాలు ఈ ట్రైన్ ను  తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే ఇతర ప్రాంతాలకు చెందిన ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఈ ఆంక్షలు పెట్టకపోవడం ఇక్కడ పలువురిని ఆగ్రహానికి గురిచేస్తుంది. రైలు అందుబాటులో లేని కారణంగా టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణాల ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమర్రి నుండి ఒక ప్రయాణికుడు  హైదరాబాద్ కు వెళ్లాలంటే కేవలం 95 రూపాయలు టికెట్ చార్జి ఉంది.

ఇదే ప్రయాణికుడు బస్సు ద్వారా హైదరాబాద్ కు వెళితే దాదాపు 600 రూపాయల ఖర్చవుతుంది. ఈ కారణంగా ఒక ప్రయాణికుడు 505 రూపాయలు నష్టపోతున్నాట్లు అర్థమవుతుంది. ఇలా రద్దవుతున్న భాగ్యనగర్ ట్రైన్ పై పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు రైలు రద్దు ప్రస్తావన కొరకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమయంలో ప్రజల అవసరాలను గుర్తించకపోవడం విచిత్రంగా ఉంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే భాగ్యనగర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు పునరుద్ధరించి సామాన్య ప్రజలకు వాటిల్లుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News