గొల్లపల్లి రైతుల గోస… పట్టించుకోని అధికారులతో పరేషాన్
ఆ గ్రామంలో దాదాపు 200 ఎకరాల్లో వరి పండిస్తారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, లెక్కలేని తనం వల్ల ఆ గ్రామంలో కనీసం కొనుగోలు కేంద్రం లేకుండా పోయింది
దిశ, బెల్లంపల్లి : ఆ గ్రామంలో దాదాపు 200 ఎకరాల్లో వరి పండిస్తారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, లెక్కలేని తనం వల్ల ఆ గ్రామంలో కనీసం కొనుగోలు కేంద్రం లేకుండా పోయింది. ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నల మండలం గొల్లపల్లి గ్రామ రైతుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. వారి గురించి పట్టించుకునే నాథుడు కానీ, అధికారి లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఊర్లో 60 మంది రైతులు సుమారు 200 ఎకరాల్లో యాసంగి పంట పండించారు. గతంలో ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఉండేది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ కొనుగోలు కేంద్రం ఎత్తేశారు.
పక్కనే ఉన్న గ్రామంలో వ్యవసాయ భూమి లేకున్నా అక్కడ రెండు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, గొల్లపల్లి మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ పీఎసీఎస్, డీసీఎంఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఒక్కటి కూడా లేదు. దీంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను రోజులుగా ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే దుస్థితి అని రైతులు చెబుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయమని చెబుతున్న అధికారులు ఇప్పటికైనా తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.