పేరు సర్కారుది.. సంపాదన మాఫియాది!

దొరికితే దొంగ.. లేకపోతే దొర అన్నచందంగా మారింది ఇసుక మాఫియా విషయంలో అధికారుల తీరు. అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమ సంపాదనకు తెర లేపుతున్నారు ప్రభుత్వ అధికారులు. జిల్లాలో ఇసుక మాఫియా అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తుండగా, అధికారుల తీరుతో కొన్ని ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం పేరు చెప్పి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఆదర్శనగర్-కొత్తూరు వద్ద గ్రామస్తులు లారీని పట్టుకున్నారు. దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని గోదావరి, స్వర్ణ […]

Update: 2021-01-09 21:47 GMT

దొరికితే దొంగ.. లేకపోతే దొర అన్నచందంగా మారింది ఇసుక మాఫియా విషయంలో అధికారుల తీరు. అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమ సంపాదనకు తెర లేపుతున్నారు ప్రభుత్వ అధికారులు. జిల్లాలో ఇసుక మాఫియా అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తుండగా, అధికారుల తీరుతో కొన్ని ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం పేరు చెప్పి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఆదర్శనగర్-కొత్తూరు వద్ద గ్రామస్తులు లారీని పట్టుకున్నారు.

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని గోదావరి, స్వర్ణ నది పరివాహక ప్రాంత గ్రామాల్లో ఇసుక అక్రమ ద౦దా పెద్దఎత్తున సాగుతోంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని మామడ, లక్ష్మణ చాందసోన్, నిర్మల్ రూరల్ మండలాలతో పాటు స్వర్ణ నదీ పరివాహక ప్రాంతంలోని సారంగపూర్ మండలంలో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పెద్దఎత్తున వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామంలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వేలం వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏడాదికి ఒక్కో ట్రాక్టర్ కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు సుమారు ఏడెనిమిది నెలల నుంచి ఈ అక్రమ దందా కొనసాగుతోంది. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అక్రమంగా వేలం పాటలు నిర్వహిస్తున్నా రెవెన్యూ, పోలీ స్, మైనింగ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరి౦చడం విమర్శలకు తావిస్తోంది. గోదావరి, స్వర్ణ నదుల్లో ఇసుక అడ్డగోలుగా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పరిసర గ్రామాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఫిర్యాదులు వస్తే తప్పా అధికారులు ఇసుక లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకోవడం లేదు.

సమీప గ్రామాల్లో డంప్..

గోదావరి, స్వర్ణ నదుల్లో జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలించి సమీప గ్రామాల్లో డంప్ చేస్తున్నారు. ఈ డంపులను టిప్పర్లలో ని౦పి నిర్మల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ కు రూ.౩వేల వరకు ఖర్చవుతుండగా.. వారు రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నారు. వీరు నిర్మల్లో ఒక్కో టిప్పర్ ఇసుక రూ.12లు వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో చూసీ చూడనట్లు వ్యవహరించేందుకు పోలీసులకు ఒక్కో టిప్పర్, ట్రాక్టర్ కు ప్రతినెలా రూ.5వేలు చొప్పున ఇస్తుండగా.. రెవెన్యూ అధికారులకు ఒకేసారి ఏడాదికి రూ.50-60వేల చొప్పున పెద్ద మొత్తంలో ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం ఇసుక డంప్ లను పట్టుకొని సీజ్ చేసి పంచనామా చేస్తున్నారు. ఈ ఇసుకను జిల్లా కలెక్టర్ అనుమతితో సర్కారు, ప్రజా అవసరాల కోసం వినియోగిస్తున్నారు. సర్కారు ప్రజా అవసరాల పేరిట ఉచితంగా తీసుకెళ్లే ఇసుక రవాణాలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇసుక మాఫియా, అధికారులు కలిసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతి ఇచ్చిన వాహనాలతోపాటు వేరే వాహనాలను లోపలికి పంపి ఇసుక నింపి బహిరంగ మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి ఉన్న వాహనాల్లోనూ ఇసుక నింపి.. కొన్ని లారీలను ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. మరికొందరు తమకు అనుమతి ఉన్న లారీలతోపాటు వేరే లారీలను కూడా పంపి ప్రైవేటుగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాజాగా ఆదర్శనగర్ కొత్తూరు ఇసుక ర్యాంపు నుంచి ఇసుకను తరలించే లారీ ఓనర్ ఒకరు తన అనుమతి ఉన్న వాహనాలతోపాటు అనుమతిలేని వాహనాన్ని కూడా పెట్టి ఇసుకను తరలించే ప్రయత్నం చేసి పట్టుబడ్డాడు.

అధికారుల సహకారంతోనే..

ఒక్కొక్క టిప్పర్ ను రూ.12-15వేల చొప్పున విక్రయిస్తున్నారు. అధికారులు ఇసుక మాఫియాకు సహకరించడం వల్లే ఈ దందా జోరుగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆదర్శనగర్ కొత్తూరు వద్ద ఇసుక డంప్ నుంచి తరలింపు వ్యవహారంలో అసలు గుట్టు రట్టయింది. పట్టుకున్న ఇసుక డంపుల్లో ఇసుకను తక్కువగా చూపుతున్నారని, తర్వాత అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారని, ఆదర్శ్ నగర్, కొత్తూరు ఇసుక డంపులలో వెయ్యి ట్రాక్టర్ల వరకు ఇసుక ఉందని, తక్కువ చూపి వేరే వాహనాల ద్వారా ప్రైవేటు మార్కెట్ కు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే అనుమతి లేని వాహనాలను లోపలికి పంపి ఇసుక నింపి బయటకు తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఇసుక డంపులను పట్టుకొని లోలోపల టెండర్లు నిర్వహించి తమ అనుకూలురకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మామడ తహసీల్దార్ శ్రీకాంత్ ను ‘దిశ ప్రతినిధి వివరణ కోరగా అలాంటిదేం లేదని.. అనుమతి ఉన్న వాహనాలనే పంపిస్తున్నామని పేర్కొన్నారు.

టెండర్లు నిర్వహించిన గ్రామాలు..

మామడ మండలంలో: కమల్ కోట, కమల్ కోటతాండ, ఆదర్శనగర్-కొత్తూరు, పొనకల్
లక్ష్మణచాంద మండలంలో: మునిపల్లి, పారుపెల్లి, పీచర
సోన్ మండలంలో: కూచన్ పల్లి, సోన్, సాకెర, కడ్తాల్, గంజాల్
నిర్మల్ రూరల్ మండలంలో: చిట్యాల, వెంగ్వాపేట్, తల్వేద
సారంగాపూర్ మండలంలో: బోరిగామ, మలక్చించోలి, యాంకర్ పల్లి, వంజర్ గుడిసెర


మామడ మండలం ఆదర్శనగర్ కొత్తూరు ఇసుక ర్యాంపు వద్ద ఇసుకతో ఓ లారీ పట్టుబడి౦ది. గోదావరి పరీవాహక ప్రాంతమైన ఈ గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలించి ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఈ విషయమై కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. కాగా, ఇక్కడ 225 ట్రాక్టర్ల ఇసుక ఉందని, ఈ ఇసుకను ప్రభుత్వావసరాల్లో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సోన్ మండలం పాక్ పట్ల గంజాల్ కడ్తాల్లో వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ ఇసుక డంపు నుంచి పది లారీల్లో ఇసుకను తరలించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. కానీ, ఈ పది లారీలతోపాటు మరికొన్ని అనుమతి లేని లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాజాగా ఆదర్శ్ నగర్ కొత్తూరులోని ర్యాంపు నుంచి అనుమతి లేని లారీలో ఇసుక నింపి తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు పొరపాటున లారీని లోపలికి పంపామని, వెంటనే లారీని వెనక్కి పంపి ఇసుక ఖాళీ చేయించి తిప్పి పంపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుకోకుండా జరిగిందని పంచనామా చేసి స్థానికులతో సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.. సర్కారు, ప్రజావసరాల పేరిట ఇసుక మాఫియా, అధికారులు కలిసి పెద్దఎత్తున అక్రమ దందా చేస్తున్నారనే౦దుకు ఇది ఓ నిదర్శనం.

Tags:    

Similar News