పీరియడ్ టైమ్‌లో ఆ పనులు మాత్రం చేయకండి.. రిస్కులో పడతారంటున్న నిపుణులు

ప్రతి నెలా పీరియడ్స్ రావడం అనేది మహిళల శరీరంలో జరిగే సహజంగా జరిగే జీవ ప్రక్రియ. అయితే నెలసరి సమయంలో మిగతా రోజులకంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కడుపు నొప్పి, అధిక రక్త స్రావం వల్ల చికాకు వంటి ప్రవర్తన కనిపించవచ్చు.

Update: 2024-05-13 08:59 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి నెలా పీరియడ్స్ రావడం అనేది మహిళల శరీరంలో జరిగే సహజంగా జరిగే జీవ ప్రక్రియ. అయితే నెలసరి సమయంలో మిగతా రోజులకంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కడుపు నొప్పి, అధిక రక్త స్రావం వల్ల చికాకు వంటి ప్రవర్తన కనిపించవచ్చు. అందుకే ఈ సమయంలో ఆరోగ్యంపట్ల తగిన శ్రద్ధ, విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మూడ్ స్వింగ్స్, తలనొప్పి, నిద్రలేమి వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే మెన్‌స్ట్రువల్ సమయంలో తెలిసో తెలియకో పలువురు మహిళలు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం.

* ప్యాడ్స్ మార్చకపోవడం : నెలసరి సమయంలో తగిన సమయం లేకనో, గ్రామీణ ప్రాంతాల్లో కొందరు అవగాహన లేకనో ఎప్పటికప్పుడు ప్యాడ్లను మార్చడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ పొరపాట్లు చేయడంవల్ల ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలెర్జీలు, చర్మంపై దురద, దద్దుర్లు వంటివి రావచ్చు. అంతేకాకుండా ఒకే ప్యాడ్‌ ఎక్కువసేపు ఉంచడం లేదా మార్చపోవడంవల్ల అందులో బ్యాక్టీరియా కారణంగా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ సంభవించే చాన్సెస్ ఉంటాయి. మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి ప్యాడ్‌లను మార్చడం ఉత్తమమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

* పెయిన్ కిల్లర్స్ వాడటం : నెలసరి నొప్పిని భరించలేక చాలామంది మహిళలు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడంవల్ల మరిన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ పేర్కొన్నది. ముఖ్యంగా గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ ఇష్యూస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.

* ఓవర్ వర్కవుట్స్ : వాస్తవానికి వర్కవుట్స్ ఆరోగ్యానికి మంచిదే. కానీ మహిళలకు పీరియడ్ సమయంలో మాత్రం అంత మంచిది కాదు. అధిక వ్యాయామాలు మెన్‌స్ట్రువల్ సైకిల్ పట్ల ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆ సమయంలో చేయకపోవడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం ఉత్తమం.

* నీళ్లు తాగకపోవడం : మెన్‌స్ట్రువల్ పెయిన్, అధిక రక్త స్రావం వంటివి ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగా తాగితే మరింత అధికం అవుతుందని కొందరు చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు. తాగకపోవడంవల్లే నష్టం జరుగుతుంది. డీహైడ్రేషన్ ఏర్పడి శరీరానికి సరైన రక్త ప్రసరణ జరగకపోవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే చాన్స్ ఉంటుంది. కాబట్టి పీరియడ్ టైమ్‌లో‌నూ ఎప్పటిలాగే తగినంత వాటర్ తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఉండే పండ్లు, కూరగాయలు, ఆహారాలు తీసుకోవడం మంచిది.


Similar News