తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుంది: ఈటల రాజేందర్

దిశ, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంది లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి సోమవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని, ఆ […]

Update: 2021-12-06 11:47 GMT

దిశ, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంది లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి సోమవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని, ఆ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.

చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో జరిగిన చిన్న పాటి లొసుగును ఆధారం చేసుకుని టీడీపీని, 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ.. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారన్నారు.

కేసీఆర్ ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించాడు..?

మంత్రి స్థాయిలో ఉన్న నేనే బెదిరించి అసైన్డ్ భూమి తీసుకుంటే, మరి సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్‌లో ఎన్ని వేల ఎకరాలు తీసుకొని ఉంటారాని ఈటల ప్రశ్నించారు. అధికారులు పిచ్చోళ్లా వ్యవహరించవద్దని, అధికారులెప్పుడైనా చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. నేను భూములు కబ్జా చేశాననడం మతి లేని చర్య అని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల వత్తిళ్లకు లొంగకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మేము ఎకరా భూమి ఆక్రమించుకున్నా.. ముక్కు నేలకు రాస్తామన్నారు.

పోలీస్ వ్యాన్‌లో డబ్బు తెచ్చి పంచిన నీచ చరిత్ర కేసీఆర్‌ది.

ఎన్నికల సమయంలో పొలీస్ వ్యాన్లలో డబ్బు తెచ్చి పంచిన నీచ చరిత్ర కేసీఆర్‌ది అని ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రపంచ చరిత్రలో మనిషి హోదాను బట్టి రేట్ నిర్ణయించి డబ్బు పంచిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రూ.600 కోట్ల అక్రమ సొత్తును, రూ.4 వేల కోట్లను సంక్షేమ పథకాల పేరిట ఖర్చు చేశారన్నారు. అయినప్పటికీ ఉద్యమ స్ఫూర్తితో హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్‌కు చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇచ్చారన్నారు.

పార్టీ ఫిరాయింపుల చట్టం రావాలి.

ఎంతో భిన్నత్వంతో ఉన్న ఈ దేశాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏకత్వంలోకి తీసుకొచ్చారు. మారుతున్న క్రమంలో అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నామని, ప్రస్తుత సమయంలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరకుండా అడ్డుకునేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అభద్రతతోనే ఇతర పార్టీల విలీనం

2014 ఎన్నికల్లో 63 స్థానాలు మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుని, సొంత వారిపై అభద్రత భావంతో ఉన్న కేసీఆర్ టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేసుకుందన్నారు. అదే విధంగా 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చిన, అదే అభద్రతా భావంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారన్నారు. అసెంబ్లీలో ప్రజల తరఫున గొంతు ఎత్తే అవకాశం లేకుండా చేశారని, గతంలో సభ్యుల సంఖ్య తో ప్రమేయం లేకుండా ప్రజల సమస్యలపై గంటల తరబడి మాట్లాడే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చట్టసభల్లో ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు.

బెదిరింపులు.. తప్పుడు కేసులు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తే.. రిటర్నింగ్ అధికారులు, ఎస్పీలు బెదిరింపులకు గురి చేసి.. నామినేషన్లను తిరస్కరించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు పెడతాం, సెల్ ఫోన్ అనుమతిస్తాం.. ఓటు ఫోటో తీసి మాకు పంపాలని మంత్రులు ఎంపీటీసీ, జడ్పీటీసీలను బెదిరిస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. ఇలా ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లే బెదిరింపులకు దిగుతారన్నారని ఈటల అన్నారు

హుజురాబాద్ ప్రజలను స్ఫూర్తిగా తీసుకోవాలి..

ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నా. ఆత్మ సాక్షిగా, హుజురాబాద్ ప్రజలను స్ఫూర్తిగా తీసుకొని మీ ఓటును సరైన వ్యక్తికి వేయాలని ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ప్రతినిధులను కోరారు. కోటీశ్వరుడు కైనా.. పేదవాడికైనా రాజ్యాంగం ఒకే ఓటు ఇచ్చిందని.. ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కె.జగన్, బీజేపీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ రావు దేశ్ పాండే, నాయకులు చంద్రశేఖర్, కసిని వాసు, పోచారం రాములు, నాగరాజు, జయరాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News