తిలక్ వర్మ పోరాటం వృధా.. ఢిల్లీపై పోరాడిన ఓడిన ముంబై

ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి వరకు పోరాడి ఓడింది. 258 పరుగుల

Update: 2024-04-27 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి వరకు పోరాడి ఓడింది. 258 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాండ్యా సేన 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా సీజన్‌లో ఆరో అపజయం మూటగట్టుకున్న ముంబై.. ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కాగా, మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో అతిథ్య ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో యంగ్ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 27 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఢిల్లీకి అదిరిపోయే శుభారంభం అందించాడు.

అభిషేక్ పొరెల్ 36, షై హోప్ 41, కెప్టెన్ పంత్ 29 పరుగులతో రాణించారు. చివర్లో స్టబ్స్ (48) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా, ఉడ్, చావ్లా, నబీ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం ఎమ్‌ఐ 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 63, పాండ్యా 46, టిమ్ డేవిడ్ 37, సూర్యకుమార్ యాదవ్ 26, ఇషాన్ కిషాన్ 20 పరుగులు చేశారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 8 పరుగులతో మరోసారి నిరాశ పర్చాడు. భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ముంబై 248 రన్స్ చేయడంతో 10 పరుగుల తేడాతో పాండ్యా సేన సీజన్‌లో ఆరో ఓటమి నమోదు చేసుకుంది.

Similar News