నైతిక విలువల లోపంతోనే

ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత వెల్లివిరిసిన ఈజిప్ట్‌లోని మెసపుటేమియా తర్వాత అత్యంత ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన సింధు నాగరికత నడియాడిన మన దేశంలో తరచుగా బాలికలు, మహిళలపై అమానవీయ మూక లైంగిక దాడులు జరుగుతున్న వైనాన్ని పత్రికలూ, ప్రసార సాధనాల ద్వారా మనం గమనిస్తూనే ఉన్నాం.

Update: 2022-06-07 18:30 GMT

ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత వెల్లివిరిసిన ఈజిప్ట్‌లోని మెసపుటేమియా తర్వాత అత్యంత ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన సింధు నాగరికత నడియాడిన మన దేశంలో తరచుగా బాలికలు, మహిళలపై అమానవీయ మూక లైంగిక దాడులు జరుగుతున్న వైనాన్ని పత్రికలూ, ప్రసార సాధనాల ద్వారా మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రపంచంలో అత్యంత ఆధునిక నగరాలలో ఒకటైన హైదరాబాద్‌లో ఇటీవల ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఈ సంఘటన మన వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలకే కాదు, ప్రపంచ వేదికపై విశ్వనగరం కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేదేనని అంగీకరించక తప్పదు.

నైతిక విలువలు నేర్పాలి

తమ పిల్లలను అద్వితీయ మానవీయ విలువలతో పెంచుతూ వస్తున్న తల్లిదండ్రుల మూలంగానే ఆదర్శ సమాజ నిర్మాణం జరుగుతుందనేది నిర్వివాదాంశం. మానవ విలువలతో కూడిన ఆస్తిగా మారాల్సిన నేటి యువత ఆధునిక సమాజంలో నరరూప రాక్షసులుగా మారి అత్యంత హేయమైన ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ తరం పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారేమోననే భావన కలుగుతోంది. పిల్లల ఎదుగుదలపై ఎందుకు శ్రద్ధ వహించడం లేదనేది యక్ష ప్రశ్నగానే మిగిలిపోతోంది. తోటివారిని గౌరవించి, వారి నుంచి అపార ప్రేమను పొందుతూ, తాము బతుకుతూ ఇతరులకు ఎలా బతకాలో నేర్పించే నైతిక విలువలను పిల్లలకు అలవరిచే ప్రయత్నం చేయకపోవడం ఆందోళనకరమే.

ద్రవ్య విలువలే తప్ప మానవతా విలువలు నేర్పే ఆస్కారమే లేని చదువులు, ఉగ్గు పాలతోనే అలవడుతున్న వస్తు సంస్కృతి, అశ్లీలం-అసభ్యత-నియంత్రణ లేని అంతర్జాలం, సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగానే ఇంకా మైనారిటీ తీరని పిల్లలలో, యువతలో పశు ప్రవృత్తి పెరుగుతోంది. అందుకే ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలంటున్నారు. వేద కాలం నాటి మాట కాదు, నేడు కూడా మహిళను 'కార్యేషు దాసి-కరణేషు మంత్రి-భోజ్యేషు మాత- శయనేషు రంభ'గా భావిస్తున్నారు. పితృస్వామ్య భావజాలానికి ఊపిరిలూదుతూ 'మహిళ సెక్స్‌కు పనికొచ్చే మాంసపు ముద్ద, పిల్లలను కనే యంత్రమంటూ' బూజు పట్టిన సిద్ధాంతాలను ప్రవచిస్తున్న సిద్ధాంతకర్తల కుట్రలను తిప్పికొట్టాలి. బార్‌లు, పబ్‌లు, రేవ్ పార్టీలలో మద్యం, మత్తు పదార్థాల పంపిణీ మీద డేగ కన్నుతో నిఘా పెట్టాలి. ఘోర నేరాలు జరిగినప్పుడు నగరంలో లక్షల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎందుకు పని చేయడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

రాజకీయాల కోసం కాకుండా

ప్రజలను కాపాడటమే బాధ్యతగా ఉన్న పోలీసులు పూర్తి స్వేచ్ఛతో, నిజాయితీగా పనిచేయాలి. పోస్టింగ్‌ల కోసం కేసులను తప్పుదోవ పట్టించరాదు. బాలికలపై, మహిళలపై అత్యాచారాలు, అమానవీయ మూక లైంగిక దాడులు జరిగినప్పుడు ప్రభుత్వంగానీ ప్రతిపక్షాలుగానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. నిజాయితీగా నేరాన్ని బుుజువు చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. మీడియా సైతం రేటింగ్ పెంచుకోవడానికే పరిమితం కాకుండా తమ కర్తవ్యాన్ని సమాజహితంగా నిర్వర్తించాలి.

అర్ధరాత్రి సైతం మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా వీధులలో తిరిగే సాంఘిక వాతావరణాన్ని సృష్టించడానికి అవసరమైన నైతిక విలువలను తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి. మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, మహిళా కార్యకర్తలతో సామాజిక వేదికల మీద బహిరంగ చర్చాగోష్టులను నిర్వహిస్తూ, చైతన్య పరచాలి. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టకుండా చూడాలి. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకోవాలి.

నీలం సంపత్

సామాజిక కార్యకర్త

98667 67471

Tags:    

Similar News