గెలుపుపై..ఎవరి ధీమా వారిదే!

Update: 2024-05-16 00:45 GMT

తెలంగాణలో లోక్‌సభ పోలింగ్‌ నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో నడుస్తుంది. అన్ని పార్టీలు ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని గత నవంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమాగా చెబుతుంటే, బీజేపీ మాత్రం మూడవసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారన్న ధీమాను వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఈసారి ప్రజలు పార్లమెంట్‌లో అవకాశం ఇస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు సానుకూల పరిస్థితులు..

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు పార్టీ నేతలు సైతం కాంగ్రెస్‌కు 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల సీట్లలో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను వదిలేస్తే.. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టిపోటీని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ఓటర్లు సహజంగా అధికార పార్టీకి మెగ్గు చూపుతారని, ముస్లిం మైనార్టీలూ కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రెండూ తమకే దక్కుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పనితీరు పట్ల ఉన్న సానుకూలత, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాలకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల్లో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషించుకుంటున్నారు పార్టీ నాయకులు.

బీఆర్ఎస్, బీజేపీలు సైతం..

ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, కనీసం ఆరు స్థానాల్లో గెలుపు తథ్యమని భావిస్తోంది. అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయడం లేదన్న అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. వీరు మెదక్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి లోకసభ స్థానాలు గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ సైతం రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరుగుతోందని, తమకు అనుకూలిందని.. పైగా మోదీ క్రేజ్‌ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచేసిందని బీజేపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను 10 ఏండ్లలో అమలు చేయకపోగా మరోమారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందన్న వాదనను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లింది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు నేరుగా బీజేపీకి ఓటు వేయాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారని తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు బీఆర్ఎస్‌తో ఒప్పందం కుదిరించుకుందన్న కాంగ్రెస్ వాదన గ్రామాలలో బలంగా పోయిందని అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కేంద్రంలో సైతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందన్న ధీమాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో మాదిగలకు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చను ఎమ్మార్పీఎస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అసమ్మతి నేత మాజీ మంత్రి మోత్కుపల్లి‌తో పాటు పలువురు సామాజికవేత్తలు, విస్తృతంగా ప్రచారం చేశారు. వీళ్ళు చేసిన ప్రచారం బీజేపీకి కొంత అనుకూలంగా ఉండి కొంత శాతం ఓటర్లు అటువైపు మొగ్గు చూపినట్టు అర్థమవుతుంది. మొత్తంగా కేంద్రంలోని మూడవసారి బీజేపీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇండియా కూటమి అదే తరహాలో ప్రయత్నం చేసింది. భారతదేశంలోని ప్రజాస్వామ్యం వైపు, మార్పు వైపు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నట్లుగా ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నప్పటికీ ఫలితాలు ఎలా ఉంటాయో.. జూన్ 4న మనకు తేటతెల్లం అవుతుంది.

- వేముల గోపీనాథ్

96668 00045

Tags:    

Similar News