ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణం నుండి ఎన్నికలు చివరి దశ ముగుస్తున్న సమయం వరకూ మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రధాన రాజకీయ

Update: 2024-05-15 01:00 GMT

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణం నుండి ఎన్నికలు చివరి దశ ముగుస్తున్న సమయం వరకూ మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అంతర్గతంగా తమ మధ్య ఉండే ఈర్ష, అసూయ, ద్వేషం వంటి వైషమ్యాలను, రాజకీయ విభేదాలు పక్కనపెట్టి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ.. మోదీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని ఆ పార్టీల నాయకులు ప్రజల ముందు మొరపెట్టుకున్నారు. అయితే, వీరి మొరను ప్రజలు వినే స్థితిలో లేరు ఎందుకంటే వారి పాలనలో వారు చేసిన అరాచకాలు ఇంకా ఈ దేశ హితాన్ని కోరే ప్రజలకు గుర్తుంది.

స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, అనేక కుంభకోణాలతో దేశాన్ని సర్వనాశనం చేసింది. అందుకే ‘ఇండియా కూటమి’ పేరుతో కాంగ్రెస్‌తో జతకట్టిన వామపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, వేర్పాటువాద పార్టీలు ప్రజల మన్నలను చూరగొన లేకపోతున్నాయి. దేశానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ హయాంలో కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, టెలికాం కుంభకోణం, ఆదర్శ బిల్డింగ్ సొసైటీ కుంభకోణం లాంటి ఎన్నో అవినీతి కార్యాల్లో తలమునకలై తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మతతత్వానికి వ్యతిరేకులం అంటూనే..

అవినీతికి మేము వ్యతిరేకులం, మతతత్వానికి వ్యతిరేకులం అంటూ డబ్బాలు కొట్టుకునే కమ్యూనిస్టు పార్టీలు.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలుగా మారడం మరింత హాస్యాస్పదం. కమ్యూనిస్టు నాయకులలో మునుపటి సిద్ధాంతం, నిబద్ధత లోపించడం, పార్టీలలో సంస్థాగత వైఫల్యాలు, వ్యక్తిగత స్వార్థాలు చోటు చేసుకోవడం ఇత్యాది విషయాలు ఆ పార్టీలకు ప్రజలు దూరం కావడానికి కారణమైంది. ఒక కేరళలో మినహాయిస్తే ఆ పార్టీలకు దేశంలో ఎక్కడా మనుగడ లేదని చెప్పవచ్చు. ఆ పార్టీలకు నాయకులు, కార్యకర్తలు ఉంటారు కానీ ఓటర్లు మాత్రం ఉండరు. ఆ పార్టీలు హిందూ సంస్కృతికి వ్యతిరేకమైనవి. వారి మూల సిద్ధాంతం హిందుత్వ పార్టీ అయినా బీజేపీని వ్యతిరేకించడమే. కేరళలో అధికారం కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కొట్టుకున్నా, ఢిల్లీలో చట్టా పట్టాలేసుకుంటాయి.

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, టీఎంసీ కమ్యూనిస్టులు ఒకప్పుడు దేశం ప్రత్యర్థులు ( నేడు బీజేపీ ప్రత్యర్థిగా మారింది అనుకోండి) ఈ మూడు పార్టీలకు బర్మా, బాంగ్లాదేశ్‌ల నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఓట్లు చాలా అవసరం. అందుకే ఈ పార్టీలు సీఏఏను, ఎన్‌ఆర్‌సీని అమలు చేయనీయమని గట్టిగానే మోదీ ప్రభుత్వంతో ఢీకొంటున్నాయి. దేశ భద్రత దృష్ట్యా ఈ రెండు విషయాలలో ప్రజల ఆలోచనలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం ఉంది. అందుకే రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఘన విజయం సాధించడం ఖాయమని ఎన్నికల సర్వేలు ముందే తేల్చి చెప్పేశాయి.

మీరు పెట్టిన కేసులు అక్రమమైనవేనా?

ఇక జాతీయ దర్యాప్తు సంస్థలను వినియోగించి, అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీల నాయకులను జైల్లో పెడుతున్నారని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలలో వాస్తవం ఎంతో ఒకసారి గమనిస్తే.. దాణా కుంభకోణం కేసులో జైలుకెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్, అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అనేది వాస్తవం కాదా? వీళ్లపై పెట్టిన కేసులన్నీ అక్రమమైనవేనా?

కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయం కోసం దుర్వినియోగ పరచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్య హక్కులను భూస్థాపితం చేసింది ఆ పార్టీయే. చివరికి సుప్రీంకోర్టులో సీనియారిటీని కాదని, జూనియర్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించిన ఘనత ఆ పార్టీదే! దేశభద్రత, సమైక్యత, దేశ గౌరవం ఇత్యాది విషయాలలో మోడీ ప్రభుత్వం విప్లవాత్మకమైనదిగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టే రెండుసార్లు అధికారం కట్టబెట్టారు. మూడోసారి కూడా గెలిపిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీపై అక్కసుతో ప్రతీసారి ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని విమర్శిస్తే ఓట్లు పడవని మోదీ వ్యతిరేకులు తెలుసుకుని దేశానికి ఉపయోగపడే పనులను సమర్థించి తప్పులు ఉంటే వ్యతిరేకిస్తే వారికి భవిష్యత్తు ఉంటుంది.

- ఉల్లి బాల రంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News