పోటీ చేసి గెలవకపోయినా కార్పొరేటరే..?

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో త్వరలో షాడో కార్పొరేటర్లు రాబోతున్నారట. ఇప్పటి వరకు భార్యల వెనక ఉండి పరిపాలన చేసిన షాడో భర్తలను చూశాం. కానీ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి గెలవకపోయినా కార్పొరేటర్ కావచ్చు. అదేలాగో మీరే చదివేయండి.. బల్దియా ఎన్నికల్లో ఈ సారి సిట్టింగులకు టికెట్లు దక్కవని మొదటి నుంచి ప్రచారం జోరుగా జరిగింది. చాలా డివిజన్లలో వారి అవినీతి, అక్రమాలు, నోటి దురుసుతనంతో జనానికి దూరమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ […]

Update: 2020-11-25 10:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో త్వరలో షాడో కార్పొరేటర్లు రాబోతున్నారట. ఇప్పటి వరకు భార్యల వెనక ఉండి పరిపాలన చేసిన షాడో భర్తలను చూశాం. కానీ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి గెలవకపోయినా కార్పొరేటర్ కావచ్చు. అదేలాగో మీరే చదివేయండి..

బల్దియా ఎన్నికల్లో ఈ సారి సిట్టింగులకు టికెట్లు దక్కవని మొదటి నుంచి ప్రచారం జోరుగా జరిగింది. చాలా డివిజన్లలో వారి అవినీతి, అక్రమాలు, నోటి దురుసుతనంతో జనానికి దూరమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అదే పార్టీలోని కొందరు నాయకులు తమకు టికెట్టు పక్కా అని భావించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా అధిష్ఠానాన్ని ఒప్పిస్తా.. పని చేసుకోండంటూ వారికి హామీ ఇచ్చారు. దాంతో ఆ నాయకులంతా అండర్ గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారందరికీ షాక్ ఇస్తూ చాలా మంది సిట్టింగులకే టికెట్లు కేటాయించారు. సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించడంపై ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేటీఆర్ ససేమిరా అన్నారు. వాళ్ల ప్రవర్తనపై మీడియాలో వచ్చిన కథనాలను, సోషల్ మీడియాలో వారి బాగోతాను వినిపించారు. వీడియోలను చూపించారు. అయినా కేటీఆర్ సిట్టింగుల వైపే మొగ్గు చూపారు. ఆఖరికి నిమిషం వరకు కేటీఆర్ అర్ధం చేసుకుంటారని భావించారు. కానీ అభ్యర్థుల జాబితా ప్రకటన వచ్చే సరికి ఆశావాహులంతా నిట్టూర్చారు. రెండు, మూడు నెలలుగా తాము పడిన కష్టం వృథా అయ్యిందంటూ ఆవేదన చెందారు. అదే అసంతృప్తితో పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారంతా ఇండ్లల్లో కూర్చున్నారు. రెండు, మూడు రోజులు పార్టీ ప్రచారంలో పాల్గొనలేదు. పార్టీ దృష్టిలో రెబెల్స్ అభ్యర్ధులుగా మిగిలారు. కానీ అధిష్ఠానం బుజ్జగింపులతో వీళ్లంతా నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు.

కేటీఆర్ హామీతో వారిలో హుషార్

అయితే వాళ్లు అంతకు ముందే పార్టీ అభ్యర్ధులుగా ప్రచారం చేసుకోవడంతో ఇప్పుడు మరొకరికి ప్రచారం చేయలేమంటూ ఇంటికే పరిమితమయ్యారు. దాంతో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అభ్యర్థులను అసంతృప్తుల ఇంటికే తీసుకెళ్లి దండాలు పెట్టించినట్లు తెలిసింది. కొందరైతే ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ కాళ్లు మొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు గెలిచిన తర్వాత అసంతృప్తులను కలుపుకొని వెళ్లాలని, ఏ కాలనీకి వెళ్లినా వాళ్లను వెంట తీసుకెళ్లాల్సిందేనని ఎమ్మెల్యేలు ఆదేశించినట్లు సమాచారం. ప్రతి అభివృద్ధి పనిలో వారి భాగస్వామ్యం ఉండాల్సిందేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇంకొందరు బలమైన అసంతృప్తులు, ఎమ్మెల్యేల హామీతో రెండు, మూడు నెలలుగా ప్రచారం చేసుకున్న వారిని కార్యరంగంలోకి దించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వచ్చారు. ఆయనే వారితో స్వయంగా మాట్లాడి.. ‘వాళ్లు గెలిచినా మీరే కార్పొరేటర్లు’అంటూ భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మిమ్మల్ని కాదని వాళ్లు పార్టీలో గానీ, బల్దియాలో గానీ ఎలాంటి పని చేయడానికి వీల్లేదన్నారు. మొత్తంగా గ్రేటర్ లో త్వరలోనే షాడో కార్పొరేటర్లు రానున్నారన్న మాట.

ఇప్పుడు గెలుపు బాధ్యత వారిపైనే..

కేటీఆర్ భరోసా ఇచ్చిన తర్వాతే అసంతృప్తులంతా ప్రచారంలోకి దిగారు. పార్టీ అభ్యర్ధుల గెలుపు బాధ్యతను కూడా కేటీఆర్ అసంతృప్తుల మీదనే పెట్టారు. ఎమ్మెల్యేలు వారికే పూర్తి బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ అభ్యర్ధులతో విడిగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. కేటీఆర్ హామీ అమలైతే.. ఎన్నికల తర్వాత శివారు ప్రాంతంలోని డివిజన్లలో అసంతృప్త నాయకులు కూడా బల్దియాలో చక్రం తిప్పడం ఖాయంగా కనబడనుంది.

Tags:    

Similar News