వాళ్లేనా స్నేహితులు?
ఒక అగ్గి పుల్ల వెలిగించి కారు చీకట్లో కదలని నా పాదాలకు కాంతి రంగు పూశాడు వరదలో తలకిందుల పడవై కొట్టుకు పోతున్న నా దేహానికో తాడందించి గట్టుకు లాగి పారేశాడు అతడేనా స్నేహితుడు? నా బుగ్గ నిండా కన్నీటి పూలు పూసి దిగులు వాసనేస్తుంటే చూపుడు వేలిని చీపురు చేసి ఊడ్చి పారేసి తేట పరిచింది తలుపులన్నీ మూసుకుపోయి ఊపిరాడని చీకటిలో ఉక్కిరి బిక్కిరవుతున్నపుడు నాకోసం తెరుచుకున్న ఒకే ఒక తలుపై ప్రాణవాయువులూదింది ఆమేనా స్నేహితురాలు? […]
ఒక అగ్గి పుల్ల వెలిగించి
కారు చీకట్లో
కదలని నా పాదాలకు
కాంతి రంగు పూశాడు
వరదలో తలకిందుల పడవై
కొట్టుకు పోతున్న
నా దేహానికో తాడందించి
గట్టుకు లాగి పారేశాడు
అతడేనా స్నేహితుడు?
నా బుగ్గ నిండా
కన్నీటి పూలు పూసి
దిగులు వాసనేస్తుంటే
చూపుడు వేలిని
చీపురు చేసి ఊడ్చి పారేసి
తేట పరిచింది
తలుపులన్నీ మూసుకుపోయి
ఊపిరాడని చీకటిలో
ఉక్కిరి బిక్కిరవుతున్నపుడు
నాకోసం తెరుచుకున్న
ఒకే ఒక తలుపై
ప్రాణవాయువులూదింది
ఆమేనా స్నేహితురాలు?
నా అక్షరాలను, నా పదాలను
నా వాక్యాలను, నా కవిత్వాన్ని
నేనెవరో తెలియకపోయినా
నాకంటే ఎక్కువగా ప్రేమిస్తారు
నా నిశ్శబ్ద ఎడారితనమ్మీద
కొన్ని పలకరింపుల
చినుకులై కురుస్తారు
నా ఆనందాలనే కాదు
నా దుఃఖ సమయాలనూ
ఆరా తీస్తారు
రక్తం నీళ్ల కంటే చిక్కనైనదే
అయితే
మరింత గడ్డకట్టుకుపోయి
ప్రవహించనపుడు
ఏ రక్త బంధమూ లేని
కొందరు
మన నరాల్లో
రక్త చలనమై పరుగెడతారు
వాళ్లేనా స్నేహితులు?
అయితే
నాకూ స్నేహితులున్నారు
అలాంటివారి జాబితాలో
మీకు తెలిసిన పేర్లేవైనా వుంటే
మీకూ స్నేహితులున్నట్టే!
– చిత్తలూరి
9133832246