డీజీపీ మహేంద్రా.. నా గోడు ఆలకించవయ్యా..!

దిశ,పాలేరు: అయ్యా.. డీజీపీ మహేంద్రా.. జర నా బాధ ఆలకించవయ్యా.. నా ప్రాణంగా సాదుకున్న పిల్లలు నన్ను ఒంటరి దాన్ని చేశారు. కూడు, గూడు కరువై.. ఏకాకిని అయ్యాను. ఎవరన్న కనికరించి పెడితేనే బువ్వ. లేకపోతే నీళ్లతోనే కడుపు నింపుకోవడం. గాలి, వర్షానికి మొండి గోడలపై ఉన్న రేకులు లేచిపోయాయి. మూడు రోజులుగా ఎండలోనే మాడిపోతున్నాను. జర నా కొడుకులను పిలిపించి నా బాగోగులు చూడమనవయ్యా.. అంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని చిన్నతనంలో ఆడించిన ఆయా వేడుకుంది. […]

Update: 2021-04-07 07:45 GMT

దిశ,పాలేరు: అయ్యా.. డీజీపీ మహేంద్రా.. జర నా బాధ ఆలకించవయ్యా.. నా ప్రాణంగా సాదుకున్న పిల్లలు నన్ను ఒంటరి దాన్ని చేశారు. కూడు, గూడు కరువై.. ఏకాకిని అయ్యాను. ఎవరన్న కనికరించి పెడితేనే బువ్వ. లేకపోతే నీళ్లతోనే కడుపు నింపుకోవడం. గాలి, వర్షానికి మొండి గోడలపై ఉన్న రేకులు లేచిపోయాయి. మూడు రోజులుగా ఎండలోనే మాడిపోతున్నాను. జర నా కొడుకులను పిలిపించి నా బాగోగులు చూడమనవయ్యా.. అంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని చిన్నతనంలో ఆడించిన ఆయా వేడుకుంది. నవ మాసాలు మోసి కని పెంచిన కొడుకులు ఆమెను వదిలేసి పోవడంతో అనాథగా మారింది. శిథిలమైన గోడల మధ్య చిక్కి శల్యమై.. ఎవరన్న బుక్కెడు బువ్వ పెడతారేమోనని ఎదురు చూస్తోంది.

కంచర్ల మంగమ్మ(73) దీనగాథ ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి కూతవేటు దూరంలో ఉన్న కిష్టాపురం గ్రామం ఆమెది. మంగమ్మకు వెంకట్ రెడ్డి, అచ్చిరెడ్డి, భద్రమ్మ సంతానం. వారికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటివారిని చేసింది. బిడ్డలు తల్లిని సాకడం భారమనుకున్నారో .. బాధ్యత మరిచారో తెలీదు కానీ, ఆమెని ఆ ఊరిలోనే వదిలి వేరే ప్రాంతంలో జీవిస్తున్నారు. ఆమెకు గ్రామస్తులే కొద్దో గొప్పో నిత్యావసరాల సాయం చేస్తారు. లేదా వంటలను తెచ్చి పెడతారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు శిథిలమైన మట్టి గోడలపై రెండు రేకులు వేసుకొని జీవిస్తుంది.

ఇప్పటికే కూలే దశలో ఉన్న ఆ ఇంటి పైకప్పు రేకులు సోమవారం (ఏప్రిల్ 5న) రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఎగిరిపోయాయి. దీంతో ఆ వృద్ధురాలు రాత్రంతా తడిచిన బట్టలతోనే వణుకుతూ గడిపింది. ఎండకు ఎండుతూ మొండి గోడల మధ్య నేటికి జీవచ్ఛవంలా ఉంది. విషయం తెలుసుకున్న ‘దిశ’ ఆమె స్థితిని చూసి చలించింది. స్థానికులు సహాయంతో ఎగిరిపోయిన రేగులు సేకరించి, గోడలపై వేయించి, ఆహారాన్ని అందించింది. ఎండలో ఉన్న ఆమెను ‘దిశ’ పలకరించగా.. తనకు కొడుకులు, కూతురు ఉన్నారని.. తనను పట్టిచుకోవడం లేదంటూ భోరున విలపించింది.

తాను ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డిని చిన్న తనంలో లాలించేదాన్నని చెప్పింది. వాళ్ల అమ్మ అచ్చమ్మకు ఆరోగ్యం బాగలేకుంటే ఎత్తుకుని ఊరంతా తిప్పేదాన్నని చెబుతుంది. ‘‘అయ్యా మహేంద్రా.. నువ్వైన నా కుమారులను, కూతురుని పిలిపించి సాకేటట్టు చూడయ్యా..’’ అంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది. పిల్లలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఆ వృద్ధురాలిని కాపాడాలని గ్రామస్తులు సైతం కోరుతున్నారు. మరీ డీజీపీ స్పందిస్తారో, లేదో చూడాలి.

Tags:    

Similar News