TG: రెండో రోజు 69 నామినేషన్లు దాఖలు

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో మొదటి రోజున 42 మంది అభ్యర్థుల తరఫున 48 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజైన శుక్రవారం 58 మంది అభ్యర్థుల తరఫున 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

Update: 2024-04-19 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో మొదటి రోజున 42 మంది అభ్యర్థుల తరఫున 48 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజైన శుక్రవారం 58 మంది అభ్యర్థుల తరఫున 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి, చేవెళ్ళలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఆయన కుమారుడు వీరేశ్ నామినేషన్లను దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వయంగా, వారి తరఫున ప్రతినిధులు రెండో రోజు దాదాపు 20 మంది దాఖలు చేశారు. కొన్ని రిజిస్టర్డ్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా దాఖలు చేశారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం 17 స్థానాలకు 117 సెట్ల నామినేషన్లు (100 మంది) దాఖలయ్యాయి.

బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), తాండ్ర వినోద్‌రావ్ (ఖమ్మం) తదితరులు స్వయంగా, ప్రతినిధుల ద్వారా నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ళ), పద్మారావుగౌడ్ (సికింద్రాబాద్), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (నాగర్‌కర్నూల్), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మన్నె శ్రీనివాసరెడ్డి (మహబూబ్‌‌నగర్), కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి) తదితరుల తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన ఆత్రం సుగుణ (ఆదిలాబాద్), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి), బలరాం నాయక్ (మహబూబాబాద్) తదితరుల తరఫున దాఖలయ్యాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్) కూడా నామినేషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News