ఉద్యోగుల కోసం అమెజాన్ ఇండియా 'కరోనా రిలీఫ్ స్కీమ్’

by  |
Amazon
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కరోనా రిలీఫ్ స్కీమ్(సీఆర్ఎస్)ను ప్రారంభించినట్టు సోమవారం తెలిపింది. ఈ పథకం ద్వారా స్టాఫ్ ఏజెన్సీల ద్వారా నియమించబడిన అసోసియేట్స్, ఇతర అర్హత కలిగిన ఉద్యోగులకు కరోనా భత్యంతో పాటు హాస్పిటల్ రీయంబర్స్‌మెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది. కరోనా అలొవెన్స్ ద్వారా ప్రతి ఉద్యోగికి ఇంట్లోనే ఉండి కరోనా రక్షణ, వైద్య పరికరాలు, మెడిసిన్ సంబంధిత ఖర్చుల కొసం రూ. 30,600 చొప్పున వన్-టైమ్ గ్రాంట్‌గా ఇవ్వనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది.

కరోనా సంబంధిత ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించి ఉద్యోగి బీమా పరిధి దాటిపోతే, అమెజాన్ ఇండియా అదనంగా 1.9 లక్షల వరకు ఆసుపత్రి ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. అలాగే, అమెజాన్ ఇండియా తన ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి సాధ్యమైనంత త్వరగా టీకాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో ఉద్యోగులందరికీ టీకా పంపిణీ చేయనున్నట్టు వివరించింది. టీకా రెండు డోసుల కోసం స్టాఫ్ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇండియా రూ. 1,500 స్పెషల్ పే అందిస్తోంది.

Next Story