కే-పాప్ కిక్కే వేరప్ప!

by  |
కే-పాప్ కిక్కే వేరప్ప!
X

దిశ, వెబ్‌డెస్క్:

సంగీతానికి భాష ఉండదనేది జగమెరిగిన సత్యం. అలాగే డ్యాన్స్‌కి కూడా భాష ఉండదు. కానీ మంచి సంగీతానికి మంచి డ్యాన్స్ స్టెప్పులు తోడైతే వచ్చే ఉత్సాహమే వేరు. అందుకు నిదర్శనంగా కే-పాప్ సంగీతాన్ని చెప్పుకోవచ్చు. అందులో ఆడ ఎవరో, మగ ఎవరో అర్థం కాదు. చూడటానికి అందరూ ఒకేలా కనిపిస్తారు. కానీ వాళ్లు వేసే స్టెప్పులు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక పాట లిరిక్స్ అర్థం కాకపోయినా, ఏం పాడుతున్నారో తెలియకపోయినా చాలా క్యాచీగా ఉంటాయి. అందుకే అంతర్జాతీయ స్థాయిలో కే-పాప్ మ్యూజిక్‌కి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇంతకీ కే-పాప్ మ్యూజిక్ అంటే ఏంటో చెప్పలేదు కదూ.. కే-పాప్ అంటే కొరియన్ పాప్ మ్యూజిక్. కేవలం పేరు విషయంలోనే కాదు ఈ కే-పాప్ గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో మీకోసం!

దక్షిణ కొరియాలో పుట్టిన ఈ మ్యూజిక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మ్యూజిక్ జానర్‌ల నుంచి స్ఫూర్తి పొంది రూపొందింది. ఇందులో ఎక్స్‌పెరిమెంటల్, రాక్, జాజ్, గాస్పెల్, హిప్ హాప్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రానిక్, ఫోక్, కంట్రీ, క్లాసికల్.. ఇలా అన్ని రకాల సంగీత వర్గాల మేళవింపు ఉన్నాయి. అయితే దీన్ని 1992లో మరింత ఆధునిక పాశ్చాత్య సంగీతంతో కలిపి ప్రపథమ కే-పాప్ గ్రూప్‌గా పేరుపొందిన ‘సియో టైజీ అండ్ బాయ్స్’ ప్రాచుర్యం పొందేలా చేశారు. అన్ని రకాల పాశ్చాత్య సంగీతాన్ని సంప్రదాయ కొరియన్ సంగీతంతో కలిపి ఈ గ్రూప్ వైవిధ్య సంగీతాన్ని సృష్టించారు. తర్వాత 1996లో హెచ్ఓటీ గ్రూప్ వారి పుణ్యమాని ఈ కే-పాప్ సంగీతం అక్కడి యువత, టీనేజర్‌లలో ఒక సబ్‌కల్చర్‌గా మారింది. తర్వాత 2003లో టీవీఎక్స్‌క్యూ, బీవోఏ గ్రూప్‌లు ఈ సంగీతాన్ని జపాన్‌కు పాకేలా చేశాయి. ఇక అప్పుడు ప్రారంభమైన కొరియన్ వేవ్ ప్రపంచ నలుమూలలకు పాకింది. ఇప్పుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, లాటిన్ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, మధ్య ప్రాచ్యం, పాశ్చాత్య దేశాల్లో ఎంతో పాపులర్‌గా మారింది.

2000 సంవత్సరానికి ముందు దక్షిణ కొరియా సంగీతాన్ని ‘గాయో’ అని పిలిచేవారు. తర్వాత మొదటిసారి బిల్‌బోర్డ్‌లో స్థానం సంపాదించుకున్న తర్వాత కే-పాప్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక 2018, 2019 నాటికి ఈ సంగీతం చాలా ప్రజాదరణ పొందింది. బీటీఎస్, బ్లాక్‌పింక్ వంటి గ్రూప్‌ల పుణ్యమాని ఆ రెండేళ్లలో ఈ కే-పాప్ సంగీతం అంతర్జాతీయ మ్యూజిక్ మార్కెట్‌లో పవర్ ప్లేయర్‌గా మారింది. 2019లో టాప్ టెన్ మ్యూజిక్ మార్కెట్‌లలో కే-పాప్ మ్యూజిక్ ఆరో స్థానంలో నిలిచింది.

ఎందుకింత పాపులర్?

కళ్లను కట్టిపడేస్తూ, చెవులకు వినసొంపుగా ఉండి, కాళ్లను కదిలించేలా, చేతులతో స్టెప్పులు వేయించేలా ఉండే సంగీతాన్ని ఎవరైనా ఆదరిస్తారు. ఈ లక్షణాలన్నీ కే-పాప్ సంగీతానికి ఉన్నాయి. వీళ్లు ఉపయోగించే కాస్ట్యూమ్‌లు, కలర్ థియరీ వల్ల వీడియో చూడగానే ఒక ఆకర్షణ కలుగుతుంది. పాశ్చాత్య సంగీతంలో ఉన్న డల్ రంగులు కాకుండా, ఆసియా సంగీతంలో కనిపించే అధిక రంగులు కాకుండా కావాల్సిన స్థాయిలో రంగులను ఉపయోగించి వీడియోలు తీస్తారు. దాని వల్ల చూసేవారికి విజువల్ ప్రభావం చాలా చక్కగా అనిపిస్తుంది. టీవీఎక్స్‌క్యూ బ్యాండ్ వీడియోలు చూస్తే కే-పాప్ ఆర్టిస్టులు సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది. పాప్ వీడియో అనగానే ఊరికే అర్థం లేని లిరిక్స్, ఊగే స్టెప్పులు ఉంటాయనుకుంటే పొరపాటే, కే-పాప్ ప్రతి పాటలోనూ ఒక కథ ఉంటుంది. ఆ వీడియోలను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూస్తే ఇంత మీనింగ్ ఉందా? అని ఆశ్చర్యం కలుగుతుంది. కే-పాప్ ఆర్టిస్టులను అభిమానులు ప్రేమగా ఐడల్స్ అని పిలుచుకుంటారు. ఎన్ని కోట్ల మందిలో ఉన్నా వీరిని గుర్తుపట్టడానికి వీలుగా వారి పర్సనాలిటీని ఆర్టిస్టులు డెవలప్ చేసుకుంటారు. ఇక కే-పాప్ వీడియోల్లో కనిపించే ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏ కే-పాప్ వీడియోను చూసినా కూడా కొత్త స్టైల్ కనిపిస్తుంది. ఇక పాటల్లో క్యాచీగా ఉండే ఒకటి రెండు వాక్యాలు మెదడులో ఇరుక్కుపోతాయి. ఉదాహరణగా గంగ్నమ్ స్టైల్ పాటను తీసుకోవచ్చు. ఇది పూర్తి స్థాయి కే-పాప్ పాట కాకపోయినప్పటికీ దక్షిణ కొరియా పాటలను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన పాట.

కిక్కెక్కించే కొరియోగ్రఫీ

కే-పాప్ వీడియోలకు ఇతర పాపులర్ వీడియోలకు ప్రధాన తేడా కొరియోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్. గుంపులుగా చేసే డ్యాన్స్ ఫార్మేషన్ ప్రత్యేక ఆకర్షణ. చూడటానికి సింపుల్ స్టెప్పుల మాదిరిగా కనిపించినప్పటికీ అందరూ ఒక సరైన విధివిధానంతో చేయడం ఆకట్టుకుంటుంది. ప్రతి స్టెప్పులో ప్రతి ఒక్కరూ తమదైన స్టెప్పుకు తమదైన శైలిలో న్యాయం చేస్తారు. ముఖ్యంగా బీటీఎస్, బ్లాక్‌పింక్ వంటి గ్రూప్‌లలో వారి డ్యాన్స్ స్టెప్పులు, ఆర్టిస్టుల మధ్య ఉన్న కోఆర్డినేషన్ చూడొచ్చు. అలాగే వీరేదో విజువల్ ఎఫెక్టులతో ఈ డ్యాన్స్ స్టెప్పులు ఎడిట్ చేస్తారని అనుకోవద్దు. ఈ ప్రతి స్టెప్పు స్వయంగా ఆర్టిస్టే చేస్తాడు. అలా చేయడానికి వారు ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేస్తారు. అందుకే వీడియోల్లో డ్యాన్స్ స్టెప్పులు అంత కచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి లైవ్ ప్రదర్శనల్లో కూడా అంతే స్థాయిలో స్టెప్పులు వేయగలుగుతారు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవడం కంటే ఒక్కసారి ఏదైనా కే-పాప్ వీడియో చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. సంక్లిష్ట డిజైన్‌లు, అత్యద్భుత విజువల్ గ్రాఫిక్స్ స్టేజీ ప్రజెన్స్‌తో ఈ కే-పాప్ వీడియోలు మొదటి చూపులోనే వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకే ఇటీవల బీటీఎస్ వారి మొదటి పాశ్చాత్య కేపాప్ ఇంగ్లీష్ పాట ‘డైనమైట్’ బిల్‌బోర్డ్ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది.



Next Story

Most Viewed