అక్కడ కొత్త ఏడాదిలోనే సూర్యోదయం

by  |
అక్కడ కొత్త ఏడాదిలోనే సూర్యోదయం
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యుడు ఎక్కడైనా సాయంత్రమే అస్తమిస్తాడు. మళ్లీ 12 గంటలు గడవక ముందే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేందుకు చీకటి తెరలను చీల్చుకుంటూ పరుగు పరుగున వచ్చేస్తాడు. కానీ అక్కడ మాత్రం మధ్యాహ్నం కల్లా భానుడు బైబై చెప్పేస్తాడు. అంతేకాదు అప్పటి నుంచి మరో 65 రోజుల వరకు తన దర్శనమే ఇవ్వడు. సూర్యుడు రాకుండా ఉండటమా? ఇదెక్కడ అని ఆశ్చర్యపోతున్నారా?

అమెరికా ఉత్తర‌భాగంలోని అలస్కా ప్రాంతంలో గల ఉట్కియాగ్విక్‌లో సూర్యుడు నవంబర్ 19న మధ్యాహ్నమే అస్తమించాడు. అంతకన్నా విశేషమేమిటంటే.. ఆ ప్రాంత ప్రజలకు మళ్లీ సూర్యుడు 2021, జనవరి 22 దాకా కనిపించడు. ప్రతి సంవత్సరం చలికాలంలో ఇక్కడ ఇదేవిధంగా జరుగుతుండగా.. ఈ ఫినామినాను ‘పోలార్ నైట్’గా వ్యవహరిస్తారు. ఉట్కియాగ్విక్‌నే బర్రో అని కూడా పిలుస్తారు.

ఉత్తరార్థగోళం, సూర్యుడికి దూరంగా జరగడంతో ఉత్తర ప్రాంతంలో అంధకారం అలుముకుంది. అయితే బర్రో పట్టణంలో దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. భూమి తిరిగి సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడే ఈ ప్రాంతపు ప్రజలు సూర్యోదయాన్ని చూస్తారు. అప్పటివరకు ఈ పట్టణంలో సౌరవెలుగులు ఉండవు కానీ, పగటిపూట మాత్రం కొన్ని గంటలపాటు వెలుతురు ఉంటుందని స్థానికులు అంటున్నారు. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలలోపే ఉండటం గమనార్హం.

Next Story

Most Viewed