చండూరు ఎస్ఐపై ఏవోలు ఫైర్.. సస్పెండ్ చేయాలని డీఐజీకి ఫిర్యాదు

by  |
Agriculture officials
X

దిశ, చండూర్: వ్యవసాయ అధికారులను స్టేషన్‌ను తీసుకెళ్లి అకారణంగా దాడి చేసిన చండూరు ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రికల్చర్ అధికారులు నల్గొండ డీఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఆదివారం తెలంగాణ అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ నల్గొండ ఫోరమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు నల్గొండ జిల్లాలోని వ్యవసాయ అధికారులు తరలివచ్చారు. ధర్నా అనంతరం ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డీఐజీ ఏవీ.రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడారు. 2018లో చండూరు మండలంలో రైతుబంధు చెక్కులు మిస్ అయ్యాయని అప్పటి కలెక్టర్ విచారణకు ఆదేశించారన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీ రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటుందని తెలిసినప్పటికీ మూడేళ్ల తర్వాత చండూరు ఏవో మల్లేశం, ఏఈవోలు నిఖిల్ కుమార్, పవన్, నాగార్జునలను స్థానిక ఎస్ఐ సైదులు విచారణకు పిలిచారని తెలిపారు.

వ్యవసాయ అధికారులను చండూరు పోలీస్ స్టేషన్‌లో కాకుండా పీఏపల్లి స్టేషన్‌కు రావాలని ఆదేశించారని చెప్పారు. అక్కడికి వెళ్లిన అధికారులను బూతులు తిట్టడమే కాకుండా చండూర్ ఎస్ఐ సైదులు, పీఏపల్లి ఎస్ఐ, గుడిపల్లి ఎస్ఐ వీరబాబు కలిసి అకారణంగా కొట్టారని ఆరోపించారు. వ్యవసాయ అధికారులపై దాడి చేసిన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరసింహ, లింగయ్య, సంతోష్ జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed