చెల్లించేది వచ్చే ఏడాదిలోనే : ఎయిర్‌టెల్

by  |
చెల్లించేది వచ్చే ఏడాదిలోనే : ఎయిర్‌టెల్
X

దిశ, వెబ్‌డెస్క్: సర్దుబాటు చేసిన స్థూల బకాయిల్లో (AGR) మొదటి విడతగా రూ. 18 వేల కోట్లను ఇప్పటికే చెల్లించినట్టు టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel)తెలిపింది. తదుపరి చెల్లింపు 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుందని సునీల్ భారతీ నేతృత్వంలోని ఎయిర్‌టెల్ సంస్థ టెలికమ్యూనికేషన్ విభాగానికి (DOT) రాసిన లేఖ రాసింది. 2021, మార్చి 31 నాటికి డీవోటీ కోరిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతం భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి వివరణ ఇస్తూ రాసిన లేఖలో 2021 ఆర్థిక సంవత్సరంలో తదుపరి విడత చెల్లింపు ఎలా చేయనున్నదో ఎయిర్‌టెల్ వివరించింది. అంతకుముందు సుప్రీంకోర్టు టెలికాం సంస్థలకు 2021, మార్చి 31 లోగా తమ బకాయిల్లో 10 శాతం ముందుగా చెల్లించాలని కోరింది. మిగిలిన మొత్తాన్ని 2021, ఏప్రిల్ 1 తర్వాత పదేళ్ల వ్యవధిలో చెల్లించవచ్చని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ పూర్తి ఏజీఆర్ బకాయిల మొత్తం 10 శాతం అంటే ఎయిర్‌టెల్ రూ. 4,398 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 5,825 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఏజీఆర్ బకాయిలు ఎయిర్‌టెల్‌కు రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు రూ. 58,254 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎయిర్‌టెల్ రూ. 18,004 కోట్లను, వొడాఫోన్ ఐడియా రూ. 7,854 కోట్లను చెల్లించాయి. కానీ, తాజాగా డీవోటీ ఇప్పటివరకు చెల్లించిన దానితో సంబంధం లేకుండా 10 శాతాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed