టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల ఉద్యోగులకు జీతాల పెంపు!

by  |
టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల ఉద్యోగులకు జీతాల పెంపు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశీయ దిగ్గజ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఉద్యోగులకు త్వరలో వేతన పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం టాటా సన్స్ ఇతర కంపెనీలు సైతం ఉద్యోగుల జీతాలను కరోనా పూర్వస్థాయిలకు పునరుద్ధరించనున్నట్టు ప్రకటించాయి. గతేడాది కరోనా వైరస్ నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో 20 శాతం వేతన కోత అమలు చేశారు. టాటా గ్రూప్ సంస్థలైన టాటా కేపిటల్, టాటా కన్జ్యూమర్, టైటాన్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, వోల్టాస్ సహా ఇతర గ్రూప్ కంపెనీల్లోని ‘టాప్ ఎగ్జిక్యూటివ్’ల జీతాలను పునరుద్ధరించనున్నట్టు తెలిపింది. మార్చి చివరి నాటికి జీతాలను పునరుద్ధరణ ప్రకటించనున్నట్టు, త్వరలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ ఉండనుందనే అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, పర్యాటక రంగం ఇంకా కరోనా పరిస్థితుల నుంచి బయటపడకపోవడంతో ఈ విభాగంలోకి కంపెనీ అనుబంధ సంస్థ తాజ్ హోటల్ నష్టాలను ఎదుర్కొంటోందని, అదనంగా కరెంట్, సెక్యూరిటీ, ఆహార వ్యయాలను భరిస్తోందని కంపెనీ పేర్కొంది. కాగా, దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 2021-22కి 4.7 లక్షల మంది ఉద్యోగులకు జీతాల పెంపును ప్రకటించింది. గత 6 నెలల్లో ఈ పెంపు రెండోసారి. గతేడాది అక్టోబర్ టీసీఎస్ జీతాల పెంపు ప్రకటించింది. దీంతో టీసీఎస్ ఉద్యోగులు 12-14 శాతం ఇంక్రిమెంట్లను సాధించే అవకాశం ఉంది. సాధారణంగా సంస్థ 6-8 శాతం పెంపును ఇస్తుంది.


Next Story