రెడ్డీ.. డీసీసీబీ రెడీ!

by  |
రెడ్డీ.. డీసీసీబీ రెడీ!
X

దిశ, నిర్మల్:
ఆనవాయితీ గానే మరోసారి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ పీఠం ఈసారీ ‘రెడ్డి’ సామాజిక వర్గానికే దక్కబోతున్నట్టకు కనిపిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పదిమంది డీసీసీబీ చైర్మన్లు ఎన్నిక కాగా ఒక్కరు మినహా అందరూ రెడ్డి సామాజిక వర్గానికే చెందినవారు కావడం గమనార్హం. ఇది ఆదిలాబాద్ డీసీసీబీకి ఓ సంప్రదాయం అన్నట్టుగా తయారైంది. 2020 సంవత్సరానికిగాను జరిగిన సహకార సంఘాల ఎన్నికల అనంతరం జరగబోతున్న డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి మళ్లీ రెడ్డి సామాజిక వర్గం నుంచే పోటీ కనిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలు‌గా ఏర్పడినప్పటికీ డీసీసీబీకి మాత్రం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయి.

రెడ్డి నేతల నడుమనే పోటీ!

ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవికి జరగనున్నఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నుంచే బలమైన పోటీ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎవరికి వారు తమ అనుయాయులకు ఈ పీఠాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చైర్మన్ పదవికి నిర్మల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల నేతల నడుమనే పోటీ బలంగా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ శాసనసభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న‌కు అత్యంత సన్నిహితులైన అడ్డి భోజా‌రెడ్డి పేరు ఖరారు అయినట్టు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. అదే నియోజకవర్గానికి చెందిన బాలూరి గోవర్ధన్ రెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి పేర్లూ తెరపైకి వస్తున్నాయి. ఇక నిర్మల్ నియోజకవర్గం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి‌కి అనుచరులుగా ఉన్న డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, రఘునందన్ రెడ్డి లు పోటీ పడుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మామడ సొసైటీ చైర్మన్ హరీష్ కుమార్ సైతం బరిలో ఉండేందుకు సన్నద్ధమవుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం రఘునందన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌట్లబి సొసైటీ చైర్మన్ అయిర నారాయణ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్నది. ఆయన కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడు కావడం గమనార్హం. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తన అనుచరుడు ఎస్.ప్రభాకర్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు. అయితే, జోగు రామన్న ఇప్పటికే మంత్రి అల్లోల‌తోపాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడారని, చైర్మన్ పదవి భోజ‌రెడ్డి‌కి వరించేలా ఉందని పలువురు చెబుతున్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి కూడా రెడ్డి నేతలే పోటీ పడుతున్నారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ లోనే భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు. పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం ఏ మేరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లా.. నాలుగు జిల్లాల్లో పడిపోయిన నేపథ్యంలో డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఒక్కో జిల్లాకు ఇవ్వాలన్న ప్రతిపాదన తెర మీదకు వస్తున్నాయి. ఇందులోనూ సామాజిక వర్గాలవారీగా ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

Read also..

ఈలపాట.. ఇలా పోలీ‘సింగ్’!

Next Story

Most Viewed