ఎస్‌బీ ఎనర్జీ ఇండియా కొనుగోలును పూర్తి చేసిన అదానీ గ్రీన్ ఎనర్జీ!

by  |
Adani
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్​బీ ఎనర్జీ ఇండియా సంస్థను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్​(ఏజీఈఎల్​) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి భారత్​లో ఇది అతిపెద్ద ఒప్పందం కావడం విశేషం. ఈ ఒప్పందంలో భాగంగా కొనుగోలును 3.5 బిలియన్ డాలర్ల(రూ. 26,000 కోట్ల)కు పూర్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ప్రస్తుత ఏడాది మే 18 నాటి ఒప్పందం ప్రకారం ఎస్‌బీ ఎనర్జీ ఇండియా ఇప్పుడు పూర్తిగా 100 శాతం ఏజీఈఎల్‌కు అనుబంధ సంస్థగా ఉండనుంది.

ఎస్‌బీఐ ఎనర్జీ సంస్థ గతంలో జపాన్ ఆధారిత సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, భారతీ గ్రూప్ జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైంది. ఎస్​బీ ఎనర్జీలో సాఫ్ట్ బ్యాంక్​ 80 శాతం, భారతీ గ్రూప్​ 20 శాతం వాటా కలిగి ఉండేవి. ‘ఈ కొనుగోలు పునరుత్పాదక రంగంలో తమ సంస్థ అంతర్జాతీయంగా మరింత పటిష్టం కావడానికి దోహదపడుతుందని’ ఏజీఈఎల్ ఎండీ, సీఈఓ వినీత్ ఎస్ జైన్ అన్నారు. గతవారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో రానున్న పదేళ్లకు 20 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు.

ఎస్​బీ ఎనర్జీ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పునరుత్పాదక ప్లాంట్లను కలిగి ఉంది. వీటి నుంచి సుమారు 4,954 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తిని నిర్వహిస్తోంది. వాటిలో 84 శాతం సోలార్​ ఎనర్జీ, విండ్-సోలార్ ఎనర్జీ 9 శాతం, కేవలం విండ్​ నుంచి 7 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇవికాకుండా మరిన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.

Next Story

Most Viewed