ఎంపీపీ రాజీనామా చేయాల్సిందే.. టీఆర్ఎస్ పార్టీ‌లో రచ్చకెక్కిన ఒప్పందం

by  |
ఎంపీపీ రాజీనామా చేయాల్సిందే.. టీఆర్ఎస్ పార్టీ‌లో రచ్చకెక్కిన ఒప్పందం
X

దిశ, ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎంపీ పదవి కల్వకుర్తి అధికార టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఇంట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపీపీ రాజీనామా చేయాల్సిందేనని సభ్యులు డిమాండ్ చేస్తుండగా, నేను చెయ్యను అని ఎంపీపీ చెబుతుండడంతో గతంలో కుదిరిన రహస్య ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది. వివరాల్లోకి వెళితే 2019లో జరిగిన కల్వకుర్తి మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఎన్నికల్లో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏడు స్థానాలు అధికార టీఆర్ఎస్, 3 కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు తాండ్ర నుంచి పోటీలో ఉన్న మహిళకు ఎంపీపీ పదవి ఇవ్వాలని ముందుగా భావించారు. కానీ ఆమె ఓటమి పాలయ్యారు.

దీంతో ఎంపీపీ పదవి కోసం రిజర్వ్ స్థానాల నుంచి గెలుపొందిన లింగసానిపల్లి ఎంపీటీసీ సునీతా కురుమయ్య, పంజుగుల ఎంపీటీసీ సామ మనోహర చెన్నకేశవ పోటీ పడ్డారు. ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో 2019 జూన్ 7వ తేదీన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తదితర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాలు ఒకరు. రెండున్నర సంవత్సరాలు మరొకరు ఎంపీపీగా కొనసాగాలని నిర్ణయించారు. లక్కీ డ్రా లో మొదటగా అవకాశం సునీత కురుమయ్య కు దక్కింది. పార్టీ ముఖ్యుల సమక్షంలో రెండున్నర సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతానని, ఆ తర్వాత రాజీనామా చేస్తానని పేర్కొని సంతకం చేశారు. ఎందుకైనా మంచిదని ఆమె చేత రాజీనామా పత్రాన్ని కూడా రాయించుకుని సంతకం చేయించారు.

తర్వాత రెండున్నర సంవత్సరాలు నేను పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి నాకు కొంత ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. చివరకు మనోహర చెన్నకేశవ పార్టీ ముఖ్య నేతలు సూచనల మేరకు ఎంపీపీగా అవకాశం ఇవ్వడానికి వీలుగా ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా జనవరి మూడో తేదీ వరకు ఎంపీపీగా సునీతా కురుమయ్య ఇచ్చిన గడువు ముగియనుండడంతో ఆమె రాజీనామా చేయాలని పలువురు ఎంపీటీసీ లు, సభ్యులు, ముఖ్య నాయకులు సూచించారు. కానీ ఆమె అందుకు ససేమిరా అంగీకరించకపోవడంతో ఇదేమి న్యాయం అంటూ మనోహర చెన్నకేశవ ఈ విషయాన్ని మిగతా సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ లతోపాటు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు ప్రస్తుత ఎంపీపీ ధోరణిని తప్పుబట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని పదవి చేపట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో బుధవారం జరిగిన మండల సమావేశానికి హాజరైన సభ్యులు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎంపీపీ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఈ అంశంపై ఎమ్మెల్యే తదితర ముఖ్య నేతలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై కఠిన నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Next Story