టార్గెట్ ఈటల.. సొసైటీలో ప్రారంభమైన ACB తనిఖీలు

by  |
టార్గెట్ ఈటల.. సొసైటీలో ప్రారంభమైన ACB తనిఖీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్​సొసైటీలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆరేండ్ల నుంచి జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. నుమాయిష్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన ఈటల రాజేందర్.. గత నెల 15న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ దాడులు మొదలయ్యాయి.

ఆర్థిక లావాదేవీల్లో చిక్కుతారా..?

నాంపల్లి ఎగ్జిబిషన్​ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు డాక్యమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. ఆరేండ్ల నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్‌ను ఆర్థిక దిగ్భందంలో పెట్టేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వ్యాపార కార్యాకలాపాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

వాస్తవంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురై, భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఇచ్చారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉండగా… అప్పటి నుంచి గత నెల వరకు జరిగిన ఫైనాన్సియల్​స్టేటస్​మొత్తం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సొసైటీ సెక్రెటరీకి సూచించారు. దీంతో అప్పటి నుంచి ఉన్న డాక్యమెంట్లను ఏసీబీకి అప్పగించారు.

కక్షసాధింపు కోసమే

నాంపల్లి ఎగ్జిబిషన్​ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఎగ్జిబిషన్​గ్రౌండ్‌లో నుమాయిష్‌ను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. దీని నుంచి సొసైటీకి లక్షల్లో ఆదాయం వస్తోంది. అయితే ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఏసీబీ తీసుకుంటోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీ చేయడంపై ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం ఏసీబీ రూపంలో కక్ష సాధిస్తోందని ఆయన వర్గం ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.



Next Story

Most Viewed