SR Digi స్కూల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఏబీవీపీ నాయకులు

by  |
SR Digi స్కూల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఏబీవీపీ నాయకులు
X

దిశ, శంషాబాద్ : ఎస్సార్ డిజీ స్కూల్లో అధిక ఫీజులు తగ్గించాలని ఏబీవీపీ నాయకులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకెళితే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్ అతని ఇద్దరు కూతుర్లను గత ఆరేండ్లుగా శంషాబాద్‌లోని ఎస్ఆర్ డిజీ ప్రైవేట్ స్కూలులో చదివిస్తున్నాడు. స్కూల్ ఫీజు తగ్గించాలని బుధవారం ప్రిన్సిపాల్‌ను కోరడంతో తగ్గించే ప్రసక్తే లేదని, ఫీజులు కట్టకుంటే తమ పిల్లలను తీసుకుని పోవాలని అసభ్యకరంగా తిట్టిందని విద్యార్థుల తండ్రి వెంకటేష్ తెలిపారు. ఈ విషయాన్ని బాధిత తండ్రి ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్ఆర్ డీజీ స్కూలుకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు జోనల్ కో-ఆర్డినేటర్ స్రవంతితో ఫీజు విషయంలో మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు స్కూల్లో ఉన్న కుర్చీలు, టేబుల్స్, వాటర్ క్యాన్లను ధ్వంసం చేశారు. ఎయిర్ పోర్టు పోలీసులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు మనోహర్ రెడ్డి, విజయ్ కుమార్, ప్రదీప్, మహేష్, సాయి కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఎస్ఆర్ డిజీ స్కూల్స్ జోనల్ కో-ఆర్డినేటర్ స్రవంతి మాట్లాడుతూ.. ఏబీవీపీ నాయకులు మనోహర్ రెడ్డి పది మందిని తీసుకుని స్కూల్‌కు వచ్చి మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి టేబుల్స్ ను కొడుతూ మేమంటే ఏంటో మా సత్తా ఏంటో చూపిస్తానని స్కూల్లో ఉన్న కుర్చీలు, టేబుళ్లు, వాటర్ బాటిల్స్‌ను ధ్వంసం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారని అన్నారు. స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ ఏబీవీపీ నాయకుల ఆందోళనతో భయభ్రాంతులకు గురయ్యారన్నారు. వీరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

Next Story

Most Viewed