సారూ.. జర మాభూమి మాకు ఇప్పించరూ..!

by  |
సారూ.. జర మాభూమి మాకు ఇప్పించరూ..!
X

దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన గుండె సువర్ణ భర్త పేరు వెంకటయ్య. వీరికి సర్వే నెంబర్ 29లో 25 గంటల భూమి ఉంది. పాత పాస్ బుక్ లో అలాగే నూతనంగా ఇచ్చిన పాస్ బుక్(TO 5120010078)లో 25 గంటల భూమి కనిపిస్తుంది. రైతుబంధు రాకపోవడంతో వ్యవసాయ అధికారులను అడుగగా వారు మీసేవ లో చెక్ చేసుకోమని చెప్పారు. ఏమైందని మీసేవలో చెక్ చేసుకోగా దానిలో ఒక గుంట మాత్రమే వారి పేరుమీద చూపించింది.

అదే గ్రామానికి చెందిన మరో రైతు సర్వే నంబర్ 28 లోని తనకు చెందిన 24 గుంటల భూమిని బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్స్ వారికి విక్రయించగా, రెవెన్యూ అధికారులు మాత్రం గుండె సువర్ణకు చెందిన 29 సర్వేనంబర్ లో నుంచి 24 గుంటల భూమి తొలగించి బిల్దింగ్ వారికి రిజస్టర్ చేశారు. దీనిని సరిచేయాలని దాదాపు18 నెలలుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని అయినా పట్టించుకున్న పాపానపోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు తహశీల్దార్ ను కలిసినా, ఏవేవో సాకులు చెపుతూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు.

తహశీల్దార్ చేసిన పొరపాటు మమ్మల్ని ఇబ్బందులపాలు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కేశంపేట తహశీల్దార్ కార్యాలయానికి భూసంబంధిత సమస్యలతో తిరిగేవారి సంఖ్య అధికసంఖ్యలో ఉంటుందని, పట్టించుకునే నాథుడే కార్యాలయంలో వుండడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


Next Story