కిలాడీ ఫ్యామిలీ.. ఉద్యోగాల పేరుతో 21 లక్షల 70వేలు కుచ్చుటోపీ

by  |
కిలాడీ ఫ్యామిలీ.. ఉద్యోగాల పేరుతో 21 లక్షల 70వేలు కుచ్చుటోపీ
X

దిశ, హన్మకొండ టౌన్: వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బుల వసూళ్ళకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేయగా మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల నుంచి 21 లక్షల 70 వేల రూపాయల నగదు, రెండు ఖరీదైన కార్లతో పాటు, రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నకిలీ పత్రాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో చల్లా వినయ్ పాల్ రెడ్డి (37), పోరిక అనసూయ (36), లావుడ్యా నవీన్ సాకేత్ (27), రాజ్ కె.పి.సిన్హా (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు). ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరైన వినయ్ పాల్ రెడ్డి 2009 సంవత్సరంలో వీ.ఆర్.ఓ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఈయన ములుగు జిల్లా బండారు పల్లె గ్రామంలో విధులు నిర్వహించేవాడు. నిందితుడికి ఇదే సమయంలో ములుగు రెవెన్యూ విభాగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పోరిక అనసూయతో పరిచయం కావడంతో ఇరువురుకి గతంలో మ్యారేజ్ అయినా, వీరు ఇరువురు కొద్ది కాలం సహజీవనం చేసి వివాహం చేసుకున్నారు. నిందితులిద్దరు రెవెన్యూ విభాగంలో ఉద్యోగస్తులు కావడంతో నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్లను తయారు చేసి అవినీతికి పాల్పడటంతో 2012 సంవత్సరంలో నిందితులపై ములుగు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు.

కొద్ది కాలం అనంతరం నిందితులకు నకిలీ జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం కమిషనర్ రాజ్ కె.పి.సిన్హా అనే వ్యక్తితో ఢిల్లీలో పరిచయం ఏర్పడింది. ఇతని ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలుకు పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితుల్లో ప్రధాన నిందితుడు వినయ్ పాల్ రెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఏ.పీ విభాగం, భార్య పోరిక అనసూయను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా, మరో నిందితుడు సాకేత్‌ను అసిస్టెంట్ కమిషనర్‌గా నకిలీ హోదాలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా ద్వారా జిల్లా ఆర్గనైజేషన్ కమిషనర్, స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరుగుతుందని ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఉద్యోగాన్ని బట్టి ఒక్కొక్క నిరుద్యోగి నుండి సుమారు 5 లక్షల నుండి 3లక్షల వరకు వసూళ్ళకు పాల్పడ్డారు. కొద్ది కాలం అనంతరం 2019 ఆగస్టు నుండి గత సంవత్సరం ఆగస్టు వరకు 241 మంది నిరుద్యోగులను వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో 15రోజుల పాటు శిక్షణ అందజేసి శిక్షణ అనంతరం వరంగల్, నర్సంపేట, నెక్కొండ, హన్మకొండ, నల్గొండ, మంచిర్యాల, ములుగు, కరీంనగర్ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సిందిగా నకిలీ ఉత్తర్వులను అందజేశారు.

నకిలీ ఉత్తర్వులతో ఆయా ప్రాంతాలకు విధులు నిర్వహించేందుకు ఉత్సాహంగా వెళ్లిన నిరుద్యోగులకు ఈ ఉత్తర్వులు నకిలీ అని తెలియడంతో షాక్ అయ్యారు. దీంతో బాధిత నిరుద్యోగులు ఈ ముఠా సభ్యులను నిలదీయడంతో పాటు తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా నిందితులపై ఒత్తిడి చేయడంతో నిందితులు బెదిరింపులు పాల్పడుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను విచారించగా వారు పాల్పడిన మోసాలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్ గణేష్, ఎస్.ఐ అశోక్ శ్రీనివాస్, జీ సంతోష్, హెడ్‌కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, శ్రీకాంత్, లియాఖత్ ఆలీ, సృజన్, మహేందర్, శ్రీనివాస్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

epaper – 1:00 PM TS EDITION (22-11-21) చదవండి


Next Story

Most Viewed