58 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం!

by  |
58 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం!
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూలింగ్ లేదా కాలేజీ రోజుల్లో చదవడం విషయం పక్కనబెడితే, పరీక్షలు వస్తున్నాయంటే మాత్రం ఒకరిని చూసి మరొకరు.. అవసరం ఉన్నా లేకపోయినా లైబ్రరీ కార్డు చూపించి రెండు, మూడు పుస్తకాలైతే ఇంటికి తెచ్చుకుంటారు. తీరా పరీక్షలు అయిపోయిన తర్వాత వాటి సంగతే మర్చిపోతారు. మళ్లీ పరీక్షలప్పుడే పాతవి వెనక్కిచ్చి కొత్తవి తెచ్చుకుంటారు. ఒక్కోసారి సెమిస్టర్‌లు గడుస్తున్నా.. ఆ లైబ్రరీ పుస్తకాలు ఇంట్లోనే ఉండిపోతాయి. కానీ కాలేజీ వీడేటప్పుడు మాత్రం.. నో డ్యూ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆ పుస్తకాలను రిటర్న్ ఇచ్చేయాలి. లేకుంటే ఫైన్ కట్టాల్సిందే. అయితే యూకే లోని ఓ లైబ్రరీలో పుస్తకం తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్లకు దానిని రిటర్న్ చేశాడు? ఆశ్చర్యంగా ఉంది కదా? మరి లేట్ ఇచ్చినందుకు ఆయన ఎంత ఫైన్ కట్టాడో తెలుసా?

యూకేలోని మిడెల్స్‌బ్రాగ్ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలోని ‘రిటర్న్ బాక్స్’లో గతవారం ఓ పుస్తకం కనపడింది. అది జాఫ్రీ ఫాబెర్ అనే రచయిత రాసిన పోయెట్రి ఆంథాలజీ ‘బరీడ్ స్ట్రీమ్’. ఆ పుస్తకాన్ని 1962‌లో లైబ్రరీ నుంచి ఓ వ్యక్తి తీసుకున్నాడు. కానీ తిరిగివ్వలేదు. ప్రస్తుతం ఆ కవితా సంకలనం కాపీని అక్కడ ఎవరు వదిలి వెళ్లారో తెలియదు కానీ, 58 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం లైబ్రరీ చేరడంతో లైబ్రరీ సిబ్బంది సదరు వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. అయితే ఇన్ని రోజులు ఆలస్యమైనా ఆ పుస్తకం ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక ఇన్ని సంవత్సరాలుగా పుస్తకాన్ని తిరిగి ఇవ్వనందుకు సదరు వ్యక్తికి.. దాదాపు రూ. 50 వేల ఫైన్‌ విధించేవారమని లైబ్రరీ సిబ్బంది తెలిపింది. కానీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కారణంంగా పుస్తకం లేటుగా ఇచ్చినప్పటికీ ఫైన్‌ తీసుకోవడం లేదని తెలిపారు.

‘ఈ పుస్తకాన్ని మాకు తిరిగి ఇచ్చిన అపరిచిత వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ పుస్తకం తిరిగి తమ వద్ద ఉన్న పుస్తకాల్లో కలవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాలు ఆనందించడానికి ఆ పుస్తకాన్ని రిఫరెన్స్ లైబ్రరీలో ఉంచబోతున్నాం’ అని లైబ్రేరియన్ అండ్ కమ్యూనిటీ హబ్ ఆఫీసర్ డేవిడ్ హారింగ్టన్ చెప్పారు. అంతేకాదు.. గతంలో లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాలు తిరిగి ఇవ్వడానికి ఇది సరైన సమయమని, ఎన్ని సంవత్సరాలైన పర్వాలేదని, ప్రస్తుతం జరిమానాలు లేకుండానే పుస్తకాలను స్వీకరిస్తున్నందున ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.



Next Story