ఖమ్మం సీటుపై వీడని ఉత్కంఠ.. హైకమాండ్‌కు తన అభిప్రాయం చెప్పిన తుమ్మల

by Disha Web Desk 2 |
ఖమ్మం సీటుపై వీడని ఉత్కంఠ.. హైకమాండ్‌కు తన అభిప్రాయం చెప్పిన తుమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో ఖమ్మం పార్లమెంట్ సీటుపై నెలకొన్న సందిగ్ధత వీడటం లేదు. ముగ్గురు నలుగురు కీలక నేతలు పోటీ పడుతుంటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో హైకమాండ్ ఆ జిల్లాకు చెందిన కీలక నేతలతో పర్సనల్‌గా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఏఐసీసీ అగ్రనేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరిపారు. ఖమ్మం అభ్యర్థి విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నా అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా చెప్పానని తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం 100 శాతం కష్టపడుతాయని అన్నారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకున్నది.

కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అధిష్టానాలు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ 14 నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఇప్పటికే అధిష్టానం ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. రేపు అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed