నేను 24 క్యారెట్ల మేలిమి బంగారంలాంటి నాయకుడిని : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk |
నేను 24 క్యారెట్ల మేలిమి బంగారంలాంటి నాయకుడిని : వంశీచంద్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నా రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో ముడిపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచి రూపురేఖలు మార్చాలన్నదే నా అభిమతమని అన్నారు. నాకు లిక్కర్ దందాలు లేవని, నేను ఎప్పుడూ కూడా కాంట్రాక్టులు, క్లషర్ యూనిట్లు, సారా, మద్యం, మైనింగ్ వ్యాపారాలు చేయలేదని, బెదిరింపులు, కబ్జాలు నాకు తెలియవన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే పని చేయడం తనకు తెలుసని, తాను 24 క్యారెట్ల మేలిమి నాయకుడినని ఆయన అన్నారు.

మహబూబ్ నగర్ లోక్ సభ మ్యానిఫెస్టోను కూడా ప్రజల సూచనలు, సలహాలతో ప్రధాన ఎజెండాగా పొందుపరచి కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి చేరే వేస్తామని, అందులో ఉన్న 'క్యూ ఆర్' కోడ్ ను స్కాన్ చేస్తే వచ్చిన డాక్యుమెంట్‌లో తమ తమ సూచనలు, సలహాలు తెలుపవచ్చని, లేదా వాయిస్ రికార్డ్ చేసి పంపవచ్చని ఆయన అన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసం కాదని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని తెలిపారు.

ప్రధాన మ్యానిఫెస్టోలోని 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని, తుక్కుగూడ వేదికగా భారత్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు ఆయన వివరించారు. ఎంపీగా విజయం సాధించాక వంద రోజుల్లో మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ అమలుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, అధికార ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి, సీజే బెనహర్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story