ఇతర సెగ్మెంట్లలో ప్రచారానికి వెళ్లని కిషన్‌రెడ్డి.. పరువు పోగొట్టుకోవద్దని ఫిక్స్ అయ్యాడా?

by Disha Web Desk 2 |
ఇతర సెగ్మెంట్లలో ప్రచారానికి వెళ్లని కిషన్‌రెడ్డి.. పరువు పోగొట్టుకోవద్దని ఫిక్స్ అయ్యాడా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలు కాషాయ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. దేశవ్యాప్తంగా 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకోగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. అందుకుగాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేపట్టాల్సి ఉన్నా.. కిషన్ రెడ్డి మాత్రం తన పార్లమెంటు పరిధికే పరిమితమయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఇతర సెగ్మెంట్లకు ఏమాత్రం వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అధ్యక్షుడిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఇతర లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి వెళ్లడం కుదరడం కష్టమే అయినా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు.

తాను ఓడితే పరువు పోతుందని

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా హైదరాబాద్ మహానగరం పరిధి దాటిన సందర్భాలు కూడా చాలా తక్కువే. జిల్లా కేంద్రాల్లో జాతీయ స్థాయి నేతల సభలకు మినహా పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవు. అప్పుడు కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. అయినా గ్రేటర్ పరిధి దాటలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే స్థానికంగా ఆయనపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన పార్లమెంటు పరిధి దాటి ఎక్కడికీ వెళ్లడంలేదనే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఓడిపోతే పరువు పోతుందనే భయంతో తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారని చెబుతున్నారు. కాగా శ్రేణులు మాత్రం తాను మాత్రమే గెలిస్తేచాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారని విమర్శలు చేస్తుండటం గమనార్హం.

జాతీయ నాయకులపైనే ఆశలు

ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో అభ్యర్థులు శ్రమిస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్‌గా కిషన్ రెడ్డి ప్రచారానికి వెళ్లకపోవడంతో జాతీయ నాయకుల ప్రచారంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందనే ప్రచారం జరుగుతున్నా.. కిషన్ రెడ్డి ఇతర పార్లమెంట్ల ప్రచారానికి వెళ్లకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర నాయకత్వం వెనుకబడిందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి హైదరాబాద్, భువనగిరి పార్లమెంటు బూత్ స్థాయి సమ్మేళనానికి హాజరుకాలేదు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నిర్వహించిన సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అది కూడా అభ్యర్థి రిక్వెస్ట్ మేరకు హాజరైనట్లు తెలిసింది.

ఎవరి సెగ్మెంట్లలో వారు బిజీ

అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ తన సెగ్మెంట్‌తో పాటు ఇతర సెగ్మెంట్లలోనూ తిరిగారు. ప్రచారం నిర్వహించారు. కానీ ప్రస్తుతం ఆయన సైతం తన సొంత సెగ్మెంట్ కరీంనగర్‌కే పరిమితమయ్యారు. ఇకపోతే మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం మెదక్ ప్రచారానికి మినహా మరెక్కడికీ వెళ్లలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన కూడా కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇతర సెగ్మెంట్ల ప్రచారానికి వెళ్లకుండా పూర్తిస్థాయిలో ఎవరి ప్రచారంలో వారు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికైనా తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తుందా? లేదా? అనేది చూడాలి.



Next Story

Most Viewed