ఫోన్ ట్యాపింగ్ కేసు: చంచల్‌గూడ జైలుకు ఆ ముగ్గురు (వీడియో)

by GSrikanth |
ఫోన్ ట్యాపింగ్ కేసు: చంచల్‌గూడ జైలుకు ఆ ముగ్గురు (వీడియో)
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు అదనపు ఎస్పీలు భుజంగ్ రావు, తిరుపతన్నలను పోలీసులు ఆదివారం కొంపల్లిలోని జడ్జి నివాసంలో హాజరు పరిచారు. అనంతరం చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రణీత్ రావు తన టీంతో కలిసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు రాగానే ఎస్ఐబీలోని తన ఆఫీస్‌లో ఉన్న కంప్యూటర్లలోని డేటాను చెరిపి వేయటంతోపాటు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఈనెల 13న ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో వారం రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించారు.

దీంట్లో వెళ్లడైన వివరాల నేపథ్యంలో అదనపు ఎస్పీలు భుజంగ్ రావు, తిరుపతన్నలను కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో ప్రణీత్ రావుతోపాటు తాజాగా అరెస్ట్ చేసిన భుజంగ్ రావు, తిరుపతన్నలను కూడా జడ్జి ఎదుట హాజరు పరిచారు. కాగా, ఈ వ్యవహారంలో మరి కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెళ్లడైన క్రమంలో భుజంగ్ రావు, తిరుపతన్నలను కూడా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

Next Story