నకిలీ ఫింగర్ ప్రింట్‌తో ప్రధానమంత్రి పథకానికి స్కెచ్..

by Disha Web Desk 23 |
నకిలీ ఫింగర్ ప్రింట్‌తో ప్రధానమంత్రి పథకానికి  స్కెచ్..
X

దిశ, గోదావరిఖని : నకిలీ ఫింగర్ ప్రింట్ తయారుచేసి ఏకంగా కేంద్ర ప్రభుత్వం కు సంబంధించిన పథకం కు స్కెచ్ వేసిన ముఠా గుట్టును మంచిర్యాల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు ఆ స్కీం లో స్కామ్ కు పాల్పడిన నలుగురిని అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... ప్రధాన మంత్రి కౌశల్య కేంద్ర స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి ఫేక్ ఫింగర్ ప్రింట్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం అనే పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువత ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉచితంగా పలు కోర్స్ లను అందిస్తుంది. స్కీంను ప్రభుత్వం భోపాల్ కేంద్రంగా నిర్వహించబడుతున్న అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దేశంలోని నిరుద్యోగ యువకులలో స్కిల్స్ డెవలప్మెంట్ ను పెంపొందించడం కొరకు ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.

ఈ సంస్థకు సంబంధించి హైదరాబాద్ లో ఆఫీస్ ఏర్పాటు చేసి భోపాల్ లో హెడ్ ఆఫీస్ ఆర్గనైజర్ గా సాహిల్ వలి, తెలంగాణ హెడ్ ఆఫీస్ అయిన హైదరాబాద్ లోని మధుర నగర్ నగర్ నందు వున్న ఆఫీస్ ఇంచార్జ్ గా ఆవునురి శ్రీనివాస్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో మంచిర్యాల తో పాటు హుజుర్ నగర్, జనగామలో సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు ఉన్నట్లు తెలిపారు. మంచిర్యాల సెంటర్ ఆర్గనైజర్ గా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ పనిచేస్తుండగా, 2020 నుంచి ఏడాదికి 320 మందికి చొప్పున ప్రతి సెంటర్ లో నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ లలో ట్రైనింగ్ ఇస్తున్నారు. యువకులకు కోర్సులలో ట్రైనింగ్ కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక యువకునికి రూ. 13 వేలు చొప్పున నిధులు మంజూరు చేసింది. కానీ ఈ సంవత్సరం నుండి 720 మందికి పెంచింది. ఒక్కొక్క యువకుడి ట్రైనింగ్ కొరకు రూ. 3 వేల చొప్పున కేటాయించడం జరిగింది. ఈ కోర్స్ లకు హాజరు అయ్యే అభ్యర్థుల అటెండెన్స్ ఆధారంగా మాత్రమే నిధులు కేటాయించబడుతాయి. మంచిర్యాల లోని సెంటర్ లో ఈ సంవత్సరం 300 అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. అందులో కూడా ప్రతి రోజూ సగటున 50 మంది యువకులే హాజరు అవుతున్నారు.

అందువల్ల సంస్థకు హాజరు శాతం ప్రకారం తక్కువ నిధులు కేటాయించబడుతున్నాయి. దీనివల్ల సంస్థకు రాబడి తక్కువ కావడం వలన హెడ్ ఆఫీస్ నిర్వాహకుడు సాహిల్ వలి, హైదరాబాద్ ఆఫీస్ ఇంచార్జ్ ఆవునురి శ్రీనివాస్ సూచన మేరకు మంచిర్యాల సెంటర్ ఇంచార్జ్ మల్లికార్జున్ తనకు పరిచయస్థుడైనా నర్సంపేట కు చెందిన విజయ్ అనే వ్యక్తి యొక్క సూచన మేరకు నర్సంపేట కు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వర్లు యొక్క సహాయంతో 250 మంది అభ్యర్థుల ఫేక్ ఫింగర్ ప్రింట్ లను తయారు చేసి గైర్హాజరు అయిన అభ్యర్థుల అటెండెన్స్ ను కూడా ఆ ఫేక్ ఫింగర్ ప్రింట్ ద్వారా బయోమెట్రిక్ మిషన్ లో నమోదు చేసి అందరు అభ్యర్థులు హాజరు అయినట్లు రిపోర్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నిధులను కాజేస్తున్నారు. ఈ స్కామ్ గురించి సమాచారం రావడంతో వెంటనే టాస్క్ ఫోర్స్ వారిని రంగంలోకి దింపి మంచిర్యాలలో నిర్వహిస్తున్న సెంటర్ లో సెర్చ్ చేసి అక్కడ ఆఫీస్ ఇంచార్జ్ గా ఉన్న దేవేందర్ ని విచారించారు.

స్కామ్ గురించి తెలియడంతో మంచిర్యాల పోలీస్ లను స్కామ్ గురించి విచారణ చేయవలసిందిగా డీసీపీ, ఆదేశించడంతో మంచిర్యాల పోలీసులు దేవేందర్ ను పట్టుకుని అతని ఆఫీస్ లో ఉన్న ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ను, ఆఫీస్ రికార్డ్స్ ను జప్తు చేసి కేసు నమోదు చేశారు. మంచిర్యాల పోలీసులు హైదరాబాద్ కు చెందిన మల్లికార్జున్ ను, నర్సంపేట కు చెందిన సలీం జాఫర్ ను వెంకటేష్ ను అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్దనుండి ఫేక్ ఫింగర్ ప్రింట్ తయారు చేయుటకు ఉపయోగించే సామగ్రి ని రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. స్కామ్ లో ముఖ్య సూత్రదారులైన భోపాల్ కు చెందిన సాహిల్, హైదరాబాద్ కు చెందిన అవునూరి శ్రీనివాస్ ను తదుపరి విచారణ అనంతరం అరెస్టు చేయాల్సి ఉందన్నారు.



Next Story

Most Viewed