పాతబస్తీలో రివాల్వర్ కలకలం.. పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో గన్ పెట్టి బెదిరింపు

by Disha Web Desk 1 |
పాతబస్తీలో రివాల్వర్ కలకలం.. పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో గన్ పెట్టి బెదిరింపు
X

దిశ, చార్మినార్: పెట్రోల్ కోసం లైన్‌లో రమ్మన్న సిబ్బందిపై పాయింట్ బ్లాంక్‌లో రివాల్వర్ పెట్టి చంపేస్తానని బెదిరించిన ఘటన మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రివాల్వర్‌తో బెదిరించిన వ్యక్తులను పట్టుకున్న పెట్రోల్ బంక్​ సిబ్బంది మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్తుండగా రెప్పపాటులో పరారయ్యారు. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంద. మీర్‌చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మీర్‌చౌక్ పరిధిలోని ఏతేబార్ చౌక్ ప్రాంతంలోని హైదరాబాద్ ఫిల్లింగ్ స్టేషన్​ పెట్రోల్ బంక్‌కు బుధవారం రాత్రి 7.50కి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చారు.

అప్పుడే ముస్లిం సోదరులు ఉపావాస దీక్షలు వదిలిపెట్టడం.. రాకపోకలు సాగిస్తుండడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్‌లో రద్దీ పెరిగింది. క్యూ లైన్ లో రాకుండా ఆ ఇద్దరు వ్యక్తులు తమకే ఫస్ట్ పెట్రోల్ పోయాలంటూ బెదిరించారు. అందుకు పెట్రోల్ బంక్​ సిబ్బంది క్యూలైన్​ లో రావాలని చెప్పడంతో కోపోద్రిక్తులైన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్న ఓ రాడ్ తీసి కొట్టడానికి యత్నించారు. సిబ్బంది పట్టుకోవడంతో ఆ ఇద్దరిలో ఒక్కరు రివాల్వర్​ తీసి పాయింట్ బ్లాక్‌లో గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఆ ఒక్క క్షణం తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది ధైర్యం చేసి ఆ ఇద్దరిని పట్టుకున్నారు.

మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్తుండగా రెప్పపాటులో పరారయ్యారు. ఫిల్లింగ్ స్టేషన్‌ పెట్రోల్ బంక్ మేనేజర్ వినయ్​కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్‌చౌక్​ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంతకు ఇద్దరు వ్యక్తు ఎవరు.. ఏ వెపన్​ ఉపయోగించి బెదిరించారనే వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. అదే పెట్రోల్ బంక్‌లో ఇది వరకు మూడు, నాలుగు సార్లు సిబ్బందిని బెదిరించిననట్లు సమాచారం. నిందితుల కోసం మీర్‌చౌక్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.


Next Story