అల్లాదుర్గం లో 54 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

by Disha Web Desk 15 |
అల్లాదుర్గం లో 54 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ,అల్లాదుర్గం : జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు అల్లాదుర్గం మండలంలో 54 టన్నుల రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామ శివారులో టాస్క్ ఫోర్స్ అధికారులు 161 జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా ఒక లారీ, రెండు డీసీఎం వాహనాలలో బియ్యం బస్తాలను తరలిస్తుండగా వాటిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ బాలస్వామి ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గడి పెద్దాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై అక్రమ రేషన్ బియ్యం ను వాహనాలలో తరలిస్తున్నారని పక్కా సమాచారం

మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఒక లారీ, రెండు డీసీఎంలలో 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. బీదర్, ఆమనగల్, నిజాంపేట్, వరంగల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొందుల్ నుండి రేషన్ బియ్యం వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు 10 లక్షల 80 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన వాహనాల విలువ మొత్తం 23 లక్షల ఉంటుందన్నారు. ముగ్గురు లారీ డ్రైవర్లు, రైస్ మిల్లు యజమానితో కలిపి మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ బాలస్వామి వెల్లడించారు. మిల్లర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ డాక్టర్ రాజేష్, సీఐ రేణుక రెడ్డి, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ తిరుమలేష్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story