మాదాపూర్ లో రూ.4.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

by Disha Web Desk 15 |
మాదాపూర్ లో రూ.4.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
X

దిశ, శేరిలింగంపల్లి : పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్తు పదార్థాల సరఫరా దారులు కొత్త పద్దతుల్లో వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రాజమండ్రికి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని రూ.4.2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చందానాయక్ తండా రాజా రెసిడెన్సీ సమీపంలో కాటూరి సూర్య కుమార్, గుత్తుల శ్యామ్ బాబును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని, 2 మొబైల్ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన సూర్యకుమార్, గుత్తల శ్యామ్ లు చిన్ననాటి మిత్రులు. వీరిలో కాటూరి సూర్య కుమార్ 2017 సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం బెంగుళూరు వెళ్లి జైన్ యూనివర్శిటీ లో బిటెక్ (కంప్యూటర్స్) పూర్తి చేశాడు. చెడు అలవాట్లకు

అలవాటు పడి తన స్నేహితుల్లో ఒకరైన బెంగళూరుకు చెందిన అభి అనే స్నేహితుని ద్వారా ఎండీఏంఏ మత్తు పదార్థానికి బానిసగా మారాడు. ఇతను మంచి ఉన్నత కుటుంబానికి చెందినవాడు. తండ్రి రైల్వే డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతను విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుని, అందుకు మరింత డబ్బు సంపాదించడానికి గత సంవత్సరం నుండి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. గత సంవత్సరం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో సైబరాబాద్ లోని చందానగర్ పోలీస్ లు అరెస్టు చేశారు. మూడు నెలలు జైలులో గడిపి ఏ మాత్రం మారకుండా మళ్లీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆరంభించాడు. బెంగుళూరులో ఉన్న స్నేహితుడు అభి ఒక ముఖ్యమైన డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సోల్మెన్ ను వాట్సాప్ మెసేజ్ ద్వారా పరిచయం చేశాడు. జైల్ నుండి బయటకు రాగానే బెంగుళూరు వెళ్లి నైజీరియన్ డ్రగ్ స్మగ్లర్ ద్వారా ఎండీఎంఏను కొనుగోలు చేసి తాను సేవిస్తూ, తన చిన్ననాటి స్నేహితుడైన రాజమండ్రికి

చెందిన మరో బిటెక్ విద్యార్థి గుత్తుల శ్యామ్‌ బాబుకు కూడా మత్తు మందును అలవాటు చేసి ఇతని ద్వారా రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. ఈనెల 14న కాటూరి సూర్య కుమార్ బెంగళూరు వెళ్లి గాడ్ ఆఫ్ సోల్‌మన్ నుండి 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్ కు తిరిగి వచ్చి తన స్నేహితుడు గుత్తుల శ్యామ్‌ బాబుని హైదరాబాద్ కు పిలిపించుకొని ఇద్దరు కలిశారు. వారిద్దరూ 2 గ్రాముల ఎండీఎంఏను సేవించి, మిగిలిన 28 గ్రాముల డ్రగ్‌ ను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్రయించాలని ప్లాన్ చేసుకున్నారు.

దేశ వ్యాప్తంగా జరిగే ఎలక్షన్స్ సందర్భంగా అన్ని ప్రధానమైన రూట్ లలో పోలీసు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి చెక్ చేస్తుండడంతో డ్రగ్ రవాణా చేయడం కష్టంగా మారింది. దాంతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో వారు ఎండీఎంఏను గ్రాముకు రూ.10,000 నుండి రూ. 15,000 వరకు అమ్ముతున్నారు. పోలీసులు ఈ నిందితులను అరెస్ట్ చేయగా, గాడ్ ఆఫ్ సోల్మన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story