సాగర్ ఉపఎన్నిక: 88 శాతం పోలింగ్ నమోదు..?

by  |
సాగర్ ఉపఎన్నిక: 88 శాతం పోలింగ్ నమోదు..?
X

దిశ, హాలియా: సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఒకటి, రెండు చోట్ల చెదురు మదురు సంఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా ముగిసింది. 2018 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 86.82% శాతం నమోదైంది. కానీ, ఈ ఏడాది ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. సాగర్‌లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ మొత్తం ముగిసే సరికి 88 శాతం నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అంచనా వేస్తూ ప్రకటించారు. గతంలో కంటే దాదాపు 1 నుంచి 2 శాతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్లు తెలుస్తోంది. కానీ, అధికారిక ఉత్తర్వుల్లో తుది లెక్కలు మారే అవకాశం ఉంది. దీనిపై ఈసీ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయనుంది.

అయితే, సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు, అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రంపూడ్, తిరుమలగిరి( సాగర్), మాడుగులపల్లి మొత్తం ఏడు మండలాలు.. నందికొండ, హాలియా 2 మున్సిపాల్టీలతో కలిసి 2,20,300 ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 346 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను నల్గొండలోని ఆర్జలాబావి వద్ద ఉన్న గోదాంకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మే 2న కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.

నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడం‌తో సాగర్ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోత్ రవి కుమార్ నాయక్, టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్ కుమార్‌లతో కలిసి మొత్తం 41మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed