SR స్పార్క్‌ రిల్ స్కూల్ మూత‌..? అంధకారంలో విద్యార్థుల భవిష్యత్!

by  |
SR స్పార్క్‌ రిల్ స్కూల్ మూత‌..? అంధకారంలో విద్యార్థుల భవిష్యత్!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఎస్సార్ స్పార్క్‌ రిల్ ప్రైవేటు పాఠ‌శాల‌ యాజ‌మాన్యం విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతోంది. విద్యార్థులకు, త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు మాట మాత్రంగానైనా ముంద‌స్తు స‌మాచారం ఇవ్వకుండానే స్కూల్ మూసేస్తూ.. మెర్జ్ చేస్తున్నట్లుగా స‌మాచారం ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. విద్యార్థుల భ‌విష్యత్‌నే కాదు.. పాఠ‌శాల‌పై ఆధార‌ప‌డిన టీచింగ్‌, నాన్ టీచింగ్‌కు చెందిన 60 మంది సిబ్బందిని రోడ్డున ప‌డేసింది. కేవ‌లం విద్యా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకే యాజ‌మాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల కిందట యూనివ‌ర్సిటీ అటాన‌మ‌స్‌ అనుమ‌తులు చేజిక్కించుకున్న ఎస్సార్ గ్రూప్‌.. భ‌వ‌నాల అవ‌స‌రం కోసం ఏకంగా స్కూల్‌ను మూత వేసేందుకు సిద్ధప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భ‌విష్యత్‌.. వారి స్థితిగ‌తులు..వారి సౌక‌ర్యాలు..ఏ గ‌తిన పోయినా ఫ‌ర్వాలేదు అన్నట్లుగా స్కూల్ యాజ‌మాన్యం భావిస్తోంద‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను, త‌ల్లిదండ్రుల‌ను ఇక్కట్లకు గురి చేస్తున్న యాజ‌మాన్యాన్ని తిట్టిపోస్తున్నారు. కేవ‌లం విద్య వ్యాపారంపైనే మీ దృష్టి త‌ప్పా.. విద్యార్థుల భ‌విష్యత్‌ను ఏమాత్రం ప‌ట్టించుకోరా..? అంటూ త‌ల్లిదండ్రులు యాజ‌మాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా స్కూల్ నిర్వహ‌ణ సాధ్యం కాని ప‌క్షంలో క‌నీసం ఒక సంవ‌త్సరం ముందుగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేయాల్సి ఉంటుంది. అదే అఫిలియేష‌న్‌పై నూత‌న ప్రదేశంలో పాఠ‌శాల‌ను ప్రారంభించిన అధికారుల నుంచి ప‌ర్మిష‌న్లు తీసుకోవాలి. విద్యార్థుల త‌ల్లిదండ్రుల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. కానీ, ఎస్సార్ స్పార్క్‌ రిల్ పాఠ‌శాల యాజ‌మాన్యం ఇవేమీ ప‌రిగ‌ణ‌లోకి ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఫోన్లు, మెసేజ్‌ల‌తో చేతులు దులుపుకున్నారు..

వ‌రంగ‌ల్ అర్భన్ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం అనంత‌సాగ‌ర్ కేంద్రంగా విద్యాసేవ‌లందిస్తున్న స్పార్క్‌ రిల్ పాఠ‌శాల‌ను భ‌ట్టుప‌ల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్‌లో విలీనం చేస్తున్నట్లు రెండు రోజులు యాజ‌మాన్య సిబ్బంది మూడు రోజులుగా త‌ల్లిదండ్రుల‌కు ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా స‌మాచారం తెలియ‌జేస్తున్నారు. అస‌లెందుకు పాఠ‌శాల‌ను మూసేస్తున్నార‌న్న విద్యార్థుల ప్రశ్నల‌కు మాత్రం స‌మాధానం చెప్పడం లేదు. మాకేం తెలియ‌దు సార్‌.. మేనేజ్‌మెంట్ ఇన్ఫార్మ్ చేయ‌మంటే చేస్తున్నాం… మీరు ఏదైనా అడ‌గాల‌నుకుంటే ప్రైమ్‌లో వెళ్లి క‌ల‌వండి అంటూ చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

స‌గం మంది విద్యార్థులు దూరం నుంచే..

స్పార్క్‌రిల్ పాఠ‌శాల‌లో ఒక‌టి నుంచి 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఐజీసీఎస్ఈ ప‌ద్ధతిలో.. 7 నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సీబీఎస్ఈ విద్యా బోధ‌న జ‌రుగుతోంది. దాదాపు 310 మంది విద్యార్థుల‌కు పైగా విద్యన‌భ్యసిస్తున్నారు. ఎస్సార్ విద్యా సంస్థ‌ల‌పై ఉన్న న‌మ్మ‌కం, క్యాంప‌స్‌లోని అట్మాస్పియ‌ర్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీబీఎస్ఈ విద్యాబోధ‌న‌కు ట్రైనింగ్ పొందిన బోధ‌న సిబ్బంది వంటి అంశాల‌కు ఆకర్షితులైన త‌ల్లిదండ్రుల‌ను ఈ పాఠ‌శాల‌లో చేర్పించారు. ఈ పాఠ‌శాల‌లో వ‌రంగ‌ల్, హ‌న్మకొండ‌తో పాటు జ‌మ్మికుంట‌, హుజురాబాద్‌, హుస్నాబాద్‌, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి వంటి సెమీ అర్భన్ ప్రాంతాల నుంచి కూడా స‌గం మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. దూర‌మైన మంచి చ‌దువు ల‌భిస్తుంద‌న్న‌ ఉద్దేశంతోనే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ఈ పాఠశాల‌కు పంపుతున్నారు. ఫీజులు కూడా త‌డిసి మోప‌డైనా భ‌రిస్తున్నారు. అయితే అక‌స్మాత్తుంగా ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వకుండా మెర్జ్ పేరిట స్కూల్ విద్యార్థుల‌ను భ‌ట్టుప‌ల్లిలోని క్యాంప‌స్‌కు పంపాల‌ని కోరుతుండ‌టంపై మండిప‌డుతున్నారు.

తిట్టిపోస్తున్న త‌ల్లిదండ్రులు..

ఇక్కడి స్కూల్ వాతావ‌ర‌ణం, సౌక‌ర్యాలు, దూర‌భారం వంటి ఎన్నో అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నాకే ఈ స్కూల్‌ను ఎంపిక చేసుకున్నామ‌ని, ఇప్పుడు క‌నీసం ముంద‌స్తు స‌మాచారం ఇవ్వకుండా మ‌రో పాఠ‌శాల‌కు పంపాలంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్కూల్ మూసివేత విష‌యంపై కొంత‌మంది విద్యార్థుల త‌ల్లిదండ్రులు దిశ ప్రతినిధికి కాల్ చేసి ఆవేద‌న వ్యక్తం చేశారు. జ‌మ్మికుంట నుంచి భ‌ట్టుప‌ల్లికి అప్‌డౌన్ 120 కిలోమీట‌ర్ల ప్రయాణం.. రోజూ 3 గంట‌ల స‌మ‌యం ప్రయాణానికే స‌రిపోతుంద‌ని ఓ విద్యార్థి త‌ల్లి ఆవేద‌న వ్యక్తం చేసింది. అలాగే హుస్నాబాద్‌, హుజురాబాద్‌కు చెందిన వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ముంద‌స్తుగా మాట‌మాత్రంగా కూడా చెప్పకుండా.. మీటింగ్ పెట్టకుండానే మెర్జ్ పేరుతో పాఠ‌శాల‌ను సుదూర ప్రాంతంకు త‌ర‌లించ‌డంపై తల్లిదండ్రులు తిట్టిపోస్తున్నారు.

పొంత‌న‌లేని ముచ్చట్లు..

స్పార్క్‌రిల్‌ను భ‌ట్టుప‌ల్లిలోని ప్రైమ్‌లో విలీనం చేస్తున్నట్లుగా చెబుతున్న యాజ‌మాన్యం.. అదే స‌మ‌యంలో స్కూల్ స‌ర్టిఫికెట్లు ఇత‌ర‌త్రాలు స్పార్క్‌ రిల్ పేరిటే అంద‌జేస్తామ‌ని త‌ల్లిదండ్రుల‌కు న‌మ్మబ‌లుకుతున్నట్లుగా తెలుస్తోంది. త‌ల్లిదండ్రుల‌కు పంపిన మెసేజ్‌ల్లో కూడా స్పార్క్‌రిల్‌ను ప్రైమ్ పాఠ‌శాల‌లో మెర్జ్ చేస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. ప్రైమ్‌ను విజిట్ చేయాల‌ని కూడా సూచించింది. అయితే స్పార్క్‌ రిల్‌ను క్లోజ్ చేస్తున్న విష‌యాన్ని నేరుగా చెప్పకుండా మెర్జ్ చేస్తున్నామ‌ని చెప్పి.. త‌ల్లిదండ్రుల నుంచి నేరుగా ప్రైమ్‌లో అడ్మిష‌న్లు పొందేలా విద్యాసంస్థ వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతోందన్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. అయితే ఇలా చేయ‌డంతో వ‌చ్చే వారు వ‌స్తారు..రాని వారి సంగ‌తి మ‌న‌కు అన‌వ‌స‌రం అన్న ధోర‌ణిలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విష‌యంపై ఎస్సార్‌ స్పార్క్‌ రిల్ పాఠ‌శాల సెక్రట‌రీ మ‌ధుక‌ర్‌రెడ్డి వివ‌ర‌ణ తీసుకునేందుకు దిశ ప్రతినిధి ఫోన్ చేయ‌గా కాల్ క‌ల‌వ‌లేదు.

Next Story

Most Viewed