అస్సాం, మిజోరం బార్డర్‌లో హింసాత్మకం

by  |
అస్సాం, మిజోరం బార్డర్‌లో హింసాత్మకం
X

గువహతి: ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై ఆయా రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చించిన రెండు రోజుల్లోనే అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. అస్సాంలోని కచ్చర్, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో సోమవారం నాటి ఘర్షణల్లో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ఘర్షణాత్మక ప్రాంతాల గుండా వచ్చిన వాహనాలపై ఆందోళకారులు దాడులకు పాల్పడ్డారు.

ఇదీ వివాదం

మిజోరంలోని మూడు జిల్లాలు అయిజ్వాల్, కొలాసిబ్, మమిట్‌షేర్‌లు అస్సాంలోని కచ్చర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలతో 164 కిలోమీటర్ల అంతరాష్ట్ర సరిహద్దును పంచుకుంటాయి. ఈ ప్రాంతాల మధ్య కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. తమ భూభాగంలోకి చొరబడ్డారని ఇరువైపుల నివాసితులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గత నెలలో అస్సాం పోలీసులు మిజోరంలోని వైరెంతే సమీపంలో కొంత భూభాగాన్ని అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్నుంచీ ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదికాస్త సోమవారం నాటికి తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో దుండగులు కాల్పులు జరుపగా, ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది నివాసితులు గాయాలపాలయ్యారు. ఘర్షణలకు అదుపులోకి తేవడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సరిహద్దు వద్ద మోహరించారు.

ఇరువురు సీఎంలకు అమిత్ షా ఫోన్

సోమవారం ఉదయం కచ్చర్, కొలాసిబ్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు మొదలవ్వగా ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం ట్విట్టర్‌ వేదికగా వాగ్వాదాలు చేసుకున్నారు. ఇరువురూ అమిత్ షాను ట్యాగ్ చేస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మొదట మిజోరం సీఎం జొరంతంగా పలువురు కర్రలు పట్టుకుని తిరుగుతున్న వీడియోను పోస్టు చేస్తూ.. ‘దయచేసి దీనిపై దృష్టి పెట్టండి. దీన్ని వెంటనే ఆపాలి’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ‘మిజోరంలోకి వస్తున్న అమాయక దంపతులపై దాడి చేశారు. వారి కారును ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలను ఎలా సమర్థించుకుంటారు’ అని ప్రశ్నించారు.

ఈ ట్వీట్‌కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. ‘జొరంతంగ జీ, సరిహద్దులోని మా పోస్ట్‌ను వెనక్కి తీసుకోకపోతే అక్కడి పౌరులు హింసను ఆపరని మీ మిజోరం ఎస్పీ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని ఎలా నడపగలం’ అని పేర్కొంటూ అమిత్ షాను ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన అమిత్ షా ఇరువురికి ఫోన్ చేసి గొడవలు సద్దుమణిగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిస్థితుల పునరుద్ధరణకు పలు సూచనలు చేశారు.


Next Story

Most Viewed