భూమిపై టన్నుల కొద్దీ అంతరిక్ష దుమ్ము.. ఎలా వచ్చింది?

by  |
భూమిపై టన్నుల కొద్దీ అంతరిక్ష దుమ్ము.. ఎలా వచ్చింది?
X

దిశ, ఫీచర్స్ : భూమ్మీద ఉండే దుమ్ము, ధూళి మాదిరిగానే అంతరిక్షంలోని గ్రహాల మధ్య కూడా డస్ట్ పార్టికల్స్(సూక్ష్మ అణువులు) ఉంటాయి. ఇవి తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్ ద్వారా భూమిపైకి వస్తున్నాయి. ఈ అంతరిక్ష దుమ్ము సూక్ష్మాతిసూక్ష్మ అణువుల రూపంలో ఎర్త్‌పైకి చేరుతుండగా.. ఏటా ఎన్ని టన్నుల మేర భూ వాతావరణంలోకి వస్తుందనే విషయాలపై శాస్త్రవేత్తలు రెండు దశాబ్దాల పాటు పరిశోధన జరిపారు. కాగా ఆ స్టడీ వివరాలు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, ప్యారిస్-సాస్లే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, ఫ్రెంచ్ పోలార్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో 20 ఏళ్ల పాటు భూమిపై పడే అంతరిక్ష దుమ్ముపై అధ్యయనం చేశారు. గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో వాటిపై ఘన రూపంలో ఉండే మంచు, దుమ్ము ఇతర కణాలు వాయురూపంగా ఉత్పాదనం చెందుతాయని.. అవి తోకచుక్కలు, ఆస్టరాయిడ్ల రూపంలో భూ ఆవరణంలోకి ప్రవేశిస్తాయని కనుగొన్నారు.

కాగా ఈ మైక్రో మీటరోరైట్స్(సూక్ష్మాతిసూక్ష్మ అణువులు)ను సేకరించేందుకు సీఎన్ఆర్‌ఎస్ పరిశోధకుడు జీన్ డుప్రత్ ఓ ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అంటార్కిటికా మధ్య భాగం, అడెలియో ప్రాంతంలోని ఫ్రాన్స్-ఇటాలియన్ కంకొర్డియా స్టేషన్ సమీపంలో గ్రహాంతర దుమ్ము, ధూళి కణాలను భద్రపరిచాడు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు వీటిపై తమ అధ్యయనం ప్రారంభించారు. అంతేకాదు అంతరిక్ష యాత్రల సందర్భంగా కలెక్ట్ చేసిన స్పేస్ డస్ట్, ఖగోళ అణువులను కూడా ఈ ప్రదేశానికి తీసుకొచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు.

ఏటా మొత్తంగా 5,200 టన్నుల అంతరిక్ష దుమ్ము భూమ్మీద పడుతుందని నిర్ధారించిన శాస్త్రవేత్తలు.. ఇందులో 80 శాతం తోకచుక్కల ద్వారా, మిగిలినది గ్రహశకలాల‌తో భూ ఆవరణంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఇంటర్ ప్లానెటరీ డస్ట్ పార్టికల్స్ ఆయా గ్రహాల్లో నిర్వహించే పాత్రను అధ్యయనం చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ అణువులు భూమిపై ఎలాంటి రసాయనిక చర్యలు జరుపుతున్నాయో? తెలుసుకోవడం ద్వారా భూ ఆవరణంలో సంభవించే మార్పులపైనా పరిశోధన చేయనున్నారు.


Next Story