మాడు ప‌గులుతోంది..

by  |
మాడు ప‌గులుతోంది..
X

దిశ‌, ఖ‌మ్మం: వారం రోజులుగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. కొత్త‌గూడెం, పాల్వంచ‌, మ‌ణుగూరు, ఖ‌మ్మం ప్రాంతాల్లో భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు గాలి మండుతోంది. నేల నిప్పులు క‌క్కుతోంది. ఉక్క‌పోత ఊపిరి పీల్చుకోనివ్వ‌డం లేదు. జిల్లాపై సూర్యుడు నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నాడు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వు‌తున్నాయి. ఇక సింగ‌రేణి ప్రాంతాలైన కొత్త‌గూడెం, మ‌ణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో ఎండ‌వేడిమి అదిరిపోతోంది. బావుల్లోకి దిగుతున్న సింగ‌రేణి కార్మికులు అల్లాడిపోతున్నారు. మే మొద‌టివారంలోనే ఎండ‌లు ఇలా ఉంటే మూడో వారానికి ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని జ‌నం భ‌యాందోళ‌న చెందుతున్నారు. శనివారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో 41డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. పాల్వంచ 40, భ‌ద్రాచ‌లం 41, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం 40, మ‌ణుగూరులో 41 డిగ్రీల‌ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి. వ‌చ్చే 15 రోజుల పాటు వాతావ‌ర‌ణంలో ఎలాంటి మార్పు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఎండ‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

మొద‌లైన వేడిగాలులు..

సాధార‌ణంగా ఏటా తెలంగాణ రాష్ట్రంలోనే ఖ‌మ్మం జిల్లాలోనే అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుంటాయి. దీనికి ప్ర‌ధాన‌కార‌ణం ఉమ్మ‌డి జిల్లాలో సింగ‌రేణి గ‌నులు ఉండ‌టంతో వేడిమి ఎక్కువ‌గా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు చెబుతున్నారు. ఇక వ‌డ‌గాల్పులు మొద‌లు కావ‌డంతో సామాన్య జ‌నం ఠారెత్తిపోతున్నారు. అయితే, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాల్లో ఇంటి నుంచి జ‌నం బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేక‌పోయినా గ్రామాల్లో వ్య‌వ‌సాయ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వ‌రి, మొక్కజొన్న కోత‌లు, కొనుగోలు కేంద్రాల‌కు త‌ర‌లింపు వంటి ప‌నుల్లో రైతాంగం నిమ‌గ్న‌మైంది. ఉద‌యం 6 గంట‌ల‌కు చేలల్లోకి చేరుకుంటున్న కూలీలు మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కే ఇంటికి చేర‌కుంటున్నారు. సాయంత్రం 5 గంటల త‌ర్వాతే మళ్లీ ప‌నుల‌కు వెళ్తున్నారు.

Tags: khammam city, 41 degrees temperature, highest, lock down, people, working, sun


Next Story

Most Viewed