‘మనీహీస్ట్’‌ను తలపించే బ్యాంక్ రాబరీ

by  |
‘మనీహీస్ట్’‌ను తలపించే బ్యాంక్ రాబరీ
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాలు, టీవీ షోలు, పుస్తకాలు మన మీద ఎంతోకొంత ప్రభావం చూపుతాయని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. ఆయా మాధ్యమాలన్నీ కూడా ఫక్తు ఎంటర్‌టైన్మెంట్ కోసమేనని తెలిసినా, నిత్య జీవితంలో వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాం. మన జీవితానికి అడాప్ట్ చేసుకుని, భంగపడుతుంటాం. అలానే బ్రెజిల్‌లో వెల్ ప్లాన్‌తో ఎగ్జిక్యూట్ చేసిన ఓ దొంగతనానికి కూడా ఓ వెబ్ సిరీస్ ఆదర్శంగా నిలిచింది. అదే ‘మనీహీస్ట్’.

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ‘మనీ హీస్ట్’ టాప్ 5లో నిలుస్తుంది. స్పానిష్‌లో తీసిన ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇంగ్లీష్‌లో విడుదల చేయడంతో ఫుల్ క్రేజ్‌ను సంపాదించి సూపర్ సక్సెస్ అందుకుంది. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ సిరీస్ బ్యాంక్ రాబరీల నేపథ్యంలో కొనసాగుతుంది. ఓ ప్రొఫెసర్.. ఒక టీమ్‌ను ఏర్పరుచుకుని, పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు చేస్తుంటారు. సేమ్ అలానే బ్రెజిల్‌కు చెందిన ఓ 30 మంది సభ్యులు పది వెహికల్స్‌లో బ్రెజిల్‌లోని క్రిసియుమా‌ అనే సిటీలో అరాచకం సృష్టించి, సిటీ మొత్తం కాల్పులు జరిపారు. అర్ధరాత్రి వేళ ‘బ్యాంకో డీ బ్రెసిల్’ బ్యాంక్‌లో చొరబడి భారీ ఎత్తున నగదును ఎత్తుకెళ్లారు. వాళ్లంతా వెల్ ట్రైన్డ్ దొంగలుగా కనిపించగా, తమను తాము రక్షించుకోవడం కోసం అధునాతన ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డ ఈ గ్యాంగ్.. వెళ్తు వెళ్తూ బ్యాంక్‌ను బాంబుతో పేల్చేశారు. ఈ క్రమంలో వాళ్ల వాహనాల నుంచి డబ్బులు ఎగిరొచ్చి వీధుల్లో పడటంతో, స్థానికులు వాటిని ఏరుకునేందుకు పోటీపడ్డారు.

అయితే అధికారులు మాత్రం బ్యాంక్‌లో ఎంతమొత్తం పోయిందో ఇంతవరకు తేల్చకపోవడం గమనార్హం. అయితే దొంగలు వచ్చిన తీరు, బ్రెజిల్‌ బ్యాంక్ దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు అచ్చం ‘మనీహీస్ట్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తుండటం విశేషం. కాగా ఇన్వెస్టిగేటర్స్, పోలీస్ ఫోర్స్‌లు దొంగల కోసం సెర్చ్ చేస్తున్నారు. సిటీ మొత్తాన్ని భయబ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో ఓ పోలీస్‌మన్, సెక్యూరిటీ గార్డ్‌ గాయపడ్డారు.


Next Story

Most Viewed