కండోమ్‌లను మింగేస్తున్నారు..

by  |
Condoms
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎయిడ్స్ నివారణ కోసం ఉద్దేశించిన కండోమ్‌ల పేరుతో కోట్లాది రూపాయల దందా నడుస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ ఏటా ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలకు లెక్కల్లేవ్. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే కండోమ్‌ల సంఖ్యకు, రాష్ట్రంలో వినియోగమవుతున్నవాటికి లెక్కల్లో పొంతన లేదు. రాష్ట్రానికి వస్తున్న కండోమ్‌లు పంపిణీ కావడంలేదు. ప్రతీ సంవత్సరం కొత్త స్టాకుకు మాత్రం ఆర్డర్ మాత్రం వెళ్తూనే ఉన్నది. వాడకుండా మిగిలిపోతున్న కండోమ్ ప్యాకెట్లు ఎక్కడకు పోతున్నాయన్నది అంతుచిక్కడంలేదు.

కోట్లాది ప్యాకెట్లు గోదాముల్లో మూలుగుతున్నట్లు ఆ శాఖ అధికారులే చెప్తున్నా రీప్యాకింగ్ అవుతున్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పాత ప్యాకెట్లను వినియోగించకపోయినా అదనంగా కావాలంటూ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అధికారులు ఇండెంట్లు పెట్టడం ఆ శాఖ సిబ్బందికే అనుమానాలను రేకెత్తిస్తున్నది. కేంద్రం నుంచి ఉచితంగా వచ్చినవన్నీ ఎక్కడకు పోతున్నాయన్న గుసగుసలు మొదలయ్యాయి. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ భాగోతం వెనక ఉన్నవారెవరు అనేదే ఇప్పుడు సిబ్బంది మధ్య వాడివేడి చర్చకు దారితీసింది.

సురక్షిత సెక్స్ కోసం ప్రతీ ఏటా నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) అన్ని రాష్ర్టాలకు ఉచితంగా నిరోధ్ కండోమ్‌లను పంపిణీ చేస్తున్నది. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యం కారణాన అవి వినియోగానికి నోచుకోలేకపోతున్నాయి. సంవత్సరానికి సగటున 8 కోట్ల నుంచి 10 కోట్ల ప్యాకెట్‌లు కేంద్రం నుంచి వస్తున్నాయి. వాటిని క్షేత్రస్థాయిలో పంపిణీ చేయకుండా రాష్ర్ట ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కానీ కరోనా పరిస్థితుల్లో లాక్‌డౌన్ సమయంలో సుమారు 3.85 కోట్ల ప్యాకెట్లను పంపిణీ చేసినట్టు కేంద్రానికి లెక్కలు చూపించింది. అవి తప్పుడు లెక్కలేనంటూ ఆ శాఖ సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు.

పాత కండోమ్‌లను పూర్తిగా పంపిణీ చేయకుండానే, 2021 ఏడాదికిగాను మరో 2 కోట్లు ఆర్డర్ పెట్టింది. ఆ మేరకు కేంద్రం నుంచి సరఫరా కూడా అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ వాటిని ఎక్కడ పంపిణీ చేస్తున్నారనేది అంతు చిక్కడంలేదు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు లాంటి బహిరంగ ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచే విధానం గతంలో అమలయ్యేది. కానీ ఇటీవల అది అటకెక్కింది. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు ప్రభుత్వ ఆస్పత్రుల వరకు ఉచితంగా సరఫరా చేసే విధానమూ ఉన్నది. కానీ అది కూడా అమలుకావడంలేదు.

కేంద్రం నుంచి వస్తున్న కోటాలో కేవలం 20% మాత్రమే వినియోగిస్తున్నట్లు ఆ శాఖ అధికారుల సమాచారం. కానీ మిగిలినవన్నీ ఏమైపోతున్నాయన్నది అనుమానానికి దారితీస్తోంది. మరోవైపు పబ్లిక్‌కు అందుబాటులో లేకుండా చేసి కేవలం గోదాములకే పరిమితం చేశారని, చివరకు అవి వినియోగానికి నోచుకోకుండా మురుగు కాల్వల్లోకి వెళ్లిపోతున్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ప్రతీ ఏటా కోట్లాది రూపాయల ప్రజా ధనం ఇదే తీరులో దుర్వినియోగమవుతున్నదని అందులో పనిచేస్తున్న ఓ అధికారి వ్యాఖ్యానించారు.

గడచిన నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే కండోమ్‌లను మోరి పాలు చేసినట్లు రాష్ట్ర విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి తెలిపారు. ఇదే విషయమై రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేసిన ‘దిశ’ ఫోన్ కాల్‌కు ఆమె స్పందించలేదు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రాష్ర్టంలో 35 శాతం మందికి కండోమ్‌లపై అవగాహనే లేదని తేలింది. అవగాహన కల్పించాల్సిన రాష్ట్ర అధికారులు ఆ దిశగా కృషి చేయడం లేదని వ్యాఖ్యానించింది.

59 ఎన్‌జీఓల ద్వారా పంపిణీ

రాష్ర్టంలో 59 స్వచ్ఛంద సంస్థల (నాన్ గవర్నమెంట్ ఆర్గనేజేషన్) ద్వారా కండోమ్‌ల పంపిణీ జరుగుతుంది. ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ద్వారా వీటిని ఈ సంస్థలు పబ్లిక్ స్థలాలు, సినిమా థియేటర్లు, ప్రభుత్వాసుపత్రులు, బ్యాంకులు, సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, తదితర జనసమర్ధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవి కనిపించడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మచ్చుకు కూడా కనిపించడంలేదు. కేంద్రానికి మాత్రం కోట్ల సంఖ్యలో కండోమ్‌లను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు.

‘నాసిరకం’ అనే అభిప్రాయం

“కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ అవుతున్న ‘నిరోధ్’ కండోమ్‌లు నాసిరకమైనవనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇవి పాత కాలపు టెక్నాలజీకి చెందినవనే భావనతో చాలామంది తీసుకోడానికి ఆసక్తి చూపడంలేదు. మార్కెట్లో లభిస్తున్న ప్రైవేటు సంస్థల కండోమ్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫలితంగా ‘నిరోధ్’లు పనికిరాకుండా పోతున్నాయి. ప్రతీ ఏటా ఆనవాయితీ ప్రకారం కొత్త కండోమ్‌లకు ఇండెంట్ మాత్రం పెడుతున్నాం”.
– ఓ అధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్



Next Story

Most Viewed