ఖాళీగా 211 ఉపాధ్యాయ పోస్టులు.. విద్యార్థులు రావాలా.. వద్దా?

by  |
ఖాళీగా 211 ఉపాధ్యాయ పోస్టులు.. విద్యార్థులు రావాలా.. వద్దా?
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావు పేట నియోజకవర్గంలో గల ఐదు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో 211 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరోనా సమయంలో ప్రభుత్వం విద్యా వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయడంతో ఆ స్థానంలో నూతన ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. అసలే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు సరైన రీతిలో విద్య అందక వెనుకబడి ఉంటే నియోజకవర్గంలో 211 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు మాత్రం ఉపాధ్యాయులు వర్క్ అడ్జస్ట్ ‌మెంట్‌తో విద్యార్థులకు పాఠాలు నేర్పుతామని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ విద్యను అభ్యసించాలని చెబుతోంది. ఒక్కో తరగతికి సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నా.. ఆ తరగతిలో భౌతిక దూరం పాటిస్తూ ఎలా విద్యను నేర్చుకుంటారో వేచి చూడాలి.

విద్యాశాఖ అధికారులు మాత్రం వరండాలలో, చెట్ల కింద కూడా విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తామంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం ఒకే టీచర్ 5వ తరగతి వరకు పాఠాలు నేర్పిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు ఓకే టీచర్ ఇంత మంది విద్యార్థులకు పాఠాలు ఎలా నేర్పిస్తారు..? అనేది అంతుచిక్కడం లేదు. కొంతమంది చిన్నారులు మాత్రం ఇంత కాలం విద్యకు దూరంగా ఉండటం వలన, అంతకుముందు నేర్చుకున్న విద్యను మొత్తం పూర్తిగా మర్చిపోయారనే చెప్పుకోవాలి. ఈ సమస్య వలన ఉపాధ్యాయులు చిన్నారులకు పాఠాలు నేర్పించడంలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందన్న మాట వాస్తవమే. కావున, ప్రభుత్వం వెంటనే స్పందించి నియోజకవర్గంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

ఉపాధ్యాయులకు పూర్తి కాని వ్యాక్సినేషన్..

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా 95 శాతం ఉపాధ్యాయులు మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కొంత మంది ఉపాధ్యాయులకు ఆరోగ్య సమస్యలు ఉండటం వలన వ్యాక్సిన్ వేయించుకోవడానికి సుముఖత చూపించలేదని అధికారులు చెబుతున్నారు.

పూర్తికాని పాఠ్య పుస్తకాల పంపిణీ..

నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. పాత పుస్తకాలతోనే విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. నియోజవర్గ వ్యాప్తంగా నూతన పాఠ్య పుస్తకాలు 75 శాతం మాత్రమే విద్యార్థులకు పంపిణీ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed