టీ20లో అయినా టీమ్ ఇండియా పుంజుకునేనా?

by  |
టీ20లో అయినా టీమ్ ఇండియా పుంజుకునేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా పేలవమైన బౌలింగ్ కారణంగా వన్డే సిరీస్‌లో 2-1తో ఓటమి పాలయ్యింది. చివరి వన్డేలో భారీ మార్పులు చేసిన తర్వాత భారత్‌ను విజయం వరించింది. టీ20 సిరీస్ ముందు వన్డే మ్యాచ్ గెలవడంతో టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. వన్డే సిరీస్ కోల్పోయినా… హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటంతో టీ20ల్లో కలసి వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు టీ20 బౌలర్లు శార్దుల్ ఠాకూర్, నటరాజన్ చివరి వన్డేలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ భారత్‌కు కీలకంగా మారనున్నది.

టెస్టు సిరీస్ ముందు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే టీ20 సిరీస్ నెగ్గాల్సిందే. టీ20, టెస్టులు రెండు విభిన్నమైన ఫార్మాట్లు. అయినా గెలుపు వల్ల వచ్చే విశ్వాసం టీమ్ ఇండియాను ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. కేఎల్ రాహుల్, కోహ్లీ, ధావన్ ఐపీఎల్‌లో బ్యాటుతో రాణించారు. వీళ్లు తప్పకుండా రాణించాల్సి ఉంది. ఇక టీ20 తుది జట్టులో బౌలర్లు ఎవరు ఉంటారనేదానిపై సందిగ్దత నెలకొన్నది. బుమ్రా వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇక నటరాజన్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. శార్దుల్ ఠాకూర్ చివరి వన్డేలో వికెట్లు తీయగలిగాడు. అతడు ఐపీఎల్‌లో కూడా ప్రభావం చూపించాడు. కాబట్టి అతడిని తీసుకునే అవకాశం ఉన్నది. శుక్రవారం కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగనుంది. ఇక్కడ అంతకుముందు కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా – ఇండియా రెండో వన్డే

4 డిసెంబర్ 2020

సమయం : మధ్యాహ్నం 1.40 (భారత కాలమానం ప్రకారం)

మనుక ఓవల్ కాన్‌బెర్రా

లైవ్ : సోనీ సిక్స్, సోనీ టెన్ 1, సోనీ టెన్ 3, సోనీ లివ్ (యాప్)



Next Story

Most Viewed