ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన JP మోర్గాన్ CEO

by Disha Web Desk 17 |
ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన JP మోర్గాన్ CEO
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని మోడీ సవాళ్లను దాటుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని JP మోర్గాన్ చేజ్ అండ్ కో సీఈఓ జామీ డిమోన్ అన్నారు. న్యూయార్క్‌లోని ఎకనామిక్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో డిమోన్ మాట్లాడుతూ, మోడీ నాయకత్వాన్ని కొనియాడారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని సాహసోపేతమైన సంస్కరణల ద్వారా భారత ప్రధాని అద్బుతమైన పనితీరును కనబరిచారు. US ప్రభుత్వ అధికారులు మోడీ తన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో ఆలోచించుకోవాలి. భారత్‌లో విస్తృతమైన బ్యాంకింగ్ యాక్సెస్ ఉంది. దాదాపు 700 మిలియన్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. దేశంలో ప్రతి పౌరుడిని గుర్తించేందుకు ఆధార్ ఉందని డిమోన్ అన్నారు.

ప్రధాని తన దేశంలోని దాదాపు 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయట పడేశారు. భారత్‌లో అధునాతన విద్యా వ్యవస్థ, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. అవినీతిని అరికట్టడానికి, లక్షలాది మంది పేదరికం నుండి బయటపడటానికి దేశంలో క్రమబద్ధీకరించిన పన్ను వ్యవస్థను తీసుకొచ్చారని డిమోన్, మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి వాటిని మన నాయకులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. యుఎస్‌లో మెరుగైన ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడేందుకు ఇక్కడి వారు కృషి చేయాలని డిమోన్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed